ఉట్నూర్, అక్టోబర్ 17 : గిరిజన దర్బార్‌కు వచ్చిన అర్జీదారుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ మండలం మారుతిగూడ తండాకు చెందిన కొడప రాంచందర్.. దండారీ ఉత్సవాలకు ఆర్థిక సాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన రాజన్న.. వ్యవసాయ బావికి విద్యుత్ మోటర్ మంజూరు చేయాలని విన్నవించాడు. ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామానికి చెందిన విఘ్నేశ్వర్.. ఉన్నత విద్యకు ఆర్థిక సాయం చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. ఇచ్చోడ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన కుమ్ర సత్తుబాయి.. ఆసరా పింఛన్ మంజూరుచేయాలని కోరాడు. గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రాములు.. వర్షాల వల్ల నష్టపోయిన పంటకు పరిహారం ఇప్పించాలని, పలువురు వసతి గృహాల్లో ప్రవేశాలకు, ఉపాధి, ఆసరా పింఛన్లు, స్వయం ఉపాధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పీవో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. ఈ దర్బార్‌లో డీడీ దిలీప్, ఏజెన్సీ వైద్యాధికారి మనోహర్, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం..
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో రాణించే వారికి ఐటీడీఏ తరఫున మరింత ప్రోత్సాహం అందిస్తామని ఐటీడీఏ పీవో అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో క్రీడాపోటీలపై శిక్షణ ముగింపులో ఆయన పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏటూరునాగారంలో జరిగే రాష్ట్రస్థాయి గిరిజన క్రీడల్లో విద్యార్థులు సత్తాచాటి ఉట్నూర్ ఐటీడీఏకు పేరు తేవాలని ఆకాంక్షించారు. 240 మంది విద్యార్థులు, 35 మంది సిబ్బందిని ప్రత్యేక బస్సుల్లో ఏటూరునాగారం పంపించారు. ఈ కార్యక్రమంలో డీడీ దిలీప్, పీవీటీజీ ఆత్రం భాస్కర్, జిల్లా క్రీడల అధికారి పార్థసారధి, ఏటీడీవో క్రాంతి, ప్రధానోపాధ్యాయులు ప్రకాశ్, ఉత్తమ్, భూక్య రమేశ్ తదితరులు పాల్గొన్నారు.