నిర్మల్ అర్బన్, అక్టోబర్ 15 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, అధికారులు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి ఉద్యోగార్థులు పరీక్షకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,322 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అందుకు 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా మంచిర్యాల జిల్లా నుంచి 9,252.., అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 2,378 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు, ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సమయంలో సూచించిన మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో లింక్ పంపింది.
దాని ఆధారంగా అభ్యర్థులు ఐడీ నంబర్ ఎంటర్ చేసి, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్లోడ్ అవుతుంది. కాగా, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు గంటల ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు తీసుకొని కేంద్రంలోకి అనుమతించనున్నారు. హాల్‌టికెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో హాజరవ్వాలని సూచిస్తున్నారు. కాగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
అభ్యర్థుల కోసం నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఖానాపూర్, భైంసా నుంచి ఉదయం 7 గంటల నుంచే బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. నిర్మల్ బస్టాండ్ నుంచి పరీక్షా కేంద్రానికి బస్సులు నడుపుతున్నట్లు వివరించారు.