నేరడిగొండ, అక్టోబర్ 10 : గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పాలన సేవలు మరింత సులభంగా పొందడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామ్ స్వరాజ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో పాలకవర్గాలు చేపట్టిన అభివృద్ధి పనులు, అందుకు చేసిన వ్యయాల వివరాలు స్మార్ట్ఫోన్ల ద్వారా సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. పాలన వ్యవహారాల్లో పారదర్శకత కోసం ప్రజలు సులభంగా అన్ని విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఎందుకు ప్రాధాన్యం
చాలా చోట్ల పంచాయతీ పాలకవర్గాలు చేస్తున్న నిధుల వ్యయాలు తెలుసుకోవడానికి ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. అడిగిన సమాచారం తెలుసుకోవడానికి అధికారుల నుంచి కొంత సమయం పడుతోంది. కొన్ని సంవత్సరాలు వివరాలు ఇవ్వని పక్షంలో ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. సమాచారం పొందిన క్రమంలో అందుకయ్యే వ్యయాన్ని ప్రజలు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన అరచేతిలో.. అరక్షణంలో ఏ గ్రామ పంచాయతీ వివరాలు కావాలనుకుంటే ఆ వివరాలు నిధులు, వ్యయాలు అన్ని ఈ గ్రామ స్వరాజ్ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
డౌన్లోడ్ ఎలా…
ఈ గ్రామ స్వరాజ్ యాప్‌ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెర్చ్‌లో ఈ గ్రామ్ స్వరాజ్ అని టైప్ చేయాలి. ఈ యాప్‌నకు సంబంధించిన ఐకాన్ వస్తుంది. దాని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయినట్టే.
యాప్‌ను ఓపెన్ చేస్తే రాష్ట్రం తర్వాత జిల్లా, మండల పరిషత్, దాని పరిధిలో కావాల్సిన గ్రామ పంచాయతీ పేరు వరుస క్రమంలో అడుగుతుంది. వాటిని పూరించి సబ్మిట్ చేయాలి. తర్వాత అప్రూవ్డ్ యాక్టివిటీస్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ వీటిల్లో కావాల్సిన విభాగంపై క్లిక్ చేయగానే ఆ వివరాలు వస్తాయి.
యాప్‌లో ఉండే అంశాలు…
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు వాటి వ్యయం.
పంచాయతీల పాలకవర్గాలు, వారి వివరాలు.
అభివృద్ధి కోసం పాలకవర్గాలు చేపట్టిన వివిధ పనులు, ఇందుకు అయిన వ్యయాలు యాప్‌లో పొందుపర్చబడి ఉంటాయి.
పంచాయతీ నిర్వాహకులు, పారిశుధ్య కార్మికుల జీతభత్యాల వివరాలు, పాలనా కమిటీ వివరాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
పాలనలో పారదర్శకత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఈ గ్రామ్ స్వరాజ్ యాప్‌తో పంచాయతీల పాలనలో మరింత పారదర్శకత ఏర్పడుతుండడంలో సందేహం లేదు. 2019లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌తో ప్రజలు తమ గ్రామాల్లో పాలనాపరమైన అభివృద్ధి పనుల వివరాలు వారి స్మార్ట్ఫోన్ల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇంకా జిల్లాలోని ఆయా గ్రామాల్లో ప్రజలకు ఈ యాప్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
–అబ్దుల్ సమద్, ఎంపీడీవో, నేరడిగొండ