మునుగోడు ఉప పోరుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కదులుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు చిన్నయ్య, కోనప్ప, జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, దివాకర్‌రావుకు మున్సిపల్ వార్డులతో పాటు పలు గ్రామాల బాధ్యతలు అప్పగించగా, శనివారమే అక్కడికి చేరుకున్నారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రచారం హోరెత్తించనున్నారు. గులాబీ సైనికులతో కలిసి సర్కారు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను చైతన్యం చేయనున్నారు.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)అక్టోబర్ 7 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ తరఫున ఇన్చార్జులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. మునుగోడులోని చండూరు, చౌటుప్పల్ మున్సిపల్ వార్డు లు సహా చండూరు, చౌటుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, నారాయణపూర్ మండలాల్లోని వివి ధ గ్రామాల్లో వారికి కేటాయించిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో మన నాయకులు నేరుగా ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. వీరంతా ప్రచారం చేయడంతో పాటు ఓటర్లను నేరుగా కలిసి పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మీద ఉన్న నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, తమ పరిధిలోని ప్రతి ఒక్క ఓటరును కలిసి పార్టీకి విజయం చేకూరేలా పనిచేస్తామని, ప్రభుత్వ పథకాలు గడపగడపకూ తీసుకెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని జిల్లా నాయకులు స్పష్టం చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి నారాయణపూర్ మండలం సర్వెల్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్కు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్-1, వార్డు నంబర్-9లకు ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. చండూరు మండలం తీరట్పల్లి, శేరిగూడెం, ఖమ్మగూడెం గ్రామాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మర్రిగూడ మండలం తిరుగాండ్లపల్లి గ్రామానికి మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, అంతపేట గ్రామానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నాంపల్లి మండలం బీటీపురం, తుమ్మలపల్లి, రెవల్లి, పకీర్పురం, సుంఖిశాల గ్రామాలకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇన్చార్జులుగా వ్యవహరించనున్నారు.