ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 17 : స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నదని, సమైక్యతా స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. మొదటగా అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. వజ్రోత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సమైక్యతా స్ఫూర్తిని చాటడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో ఏ మాత్రం సంబంధంలేని కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన పేరిట మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నాయని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరు కావడం వెనుక రాజకీయ ప్రయోజనం తప్పా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. ఎనిమిదేళ్ల తెలంగాణ పాలనలో దేశం సమైక్యంగా సమగ్రాభివృద్ధి కోసం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ప్రజలందరూ గుర్తించేలా ఉండాలన్న ఉద్దేశంతోనే వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అటవీశాఖాధికారి శరవణన్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అధికారులు స్రవంతి, విజయలక్ష్మి, అంజిప్రసాద్, సుధీర్‌కుమార్, ధన్‌రాజ్, రవీందర్‌రెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాస్‌రెడ్డి, సుశీల్‌కుమార్, నర్సింహారెడ్డి, హన్మండ్లు, తిరుమల, టీఎర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాము, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ సుభాష్‌చందర్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జాతీయ జెండా ఎగురవేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ 60 ఏండ్లపాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందని, నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. ఆనాడు సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రగిల్చేందుకు విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా ఉండి కుట్రలను తిప్పికొట్టాలని, వివేకంతో విద్వేషాన్ని ఓడించాలని సూచించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 74 వసంతాలు పూర్తయి, 75 సంవత్సరంలో ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. దేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును జాతీయ సమైక్యతా దినంగా ఘనంగా నిర్వహించుకున్నట్లు విప్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని ఆ ఆపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంలో యోధులు త్యాగాలను తలచుకోవడం అందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ భాషా, నటరాజ్ హాజరయ్యారు.