ఎదులాపురం/ఇచ్చోడ, సెప్టెంబర్ 14 : పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మాత్రలు అందజేయనున్నారు.
వ్యాప్తి ఇలా..
కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణకు గురవుతారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
మందులతో ఉపయోగాలు ఇవి…
నులి పురుగుల నివారణ మాత్రలతో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇతర జబ్బులకు మందులు వాడే పిల్లలు ఈ మాత్రలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. 1 నుంచి 5 ఏళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద, 6-19 వయస్సు వారికి పాఠశాలల్లో ఆల్బెండజోల్ 400ఎంజీ మాత్రలు పంపిణీ చేస్తారు. రెండేళ్ల లోపు చిన్నారులకు సగం మాత్రను నీటిలో కలిపి తాగించాలి. 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను వేయించాలి. కొందరికి మాత్ర వేసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తే వారిలో ఎక్కువ పురుగులు ఉన్నట్లుగా చెబుతారు. ఇలాంటి వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే చికిత్స అందిస్తారు. ఈ మందులు పిల్లల్లో రక్తహీనతను నియంత్రిస్తాయి. పోషకాహారం ఉపయోగాన్ని మెరుగుపరుస్తాయి. నులి పురుగుల వ్యాప్తిని అరికడుతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్లకు చెప్పులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదు. భోజనానికి ముందు, మల విసర్జన అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
పంపిణీ కేంద్రాల ఏర్పాటు..
జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో మాత్రలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలల్లో కూడా మాత్రలు పంపిణీ చేయనున్నారు. తొలుత ఈ నెల 15న, తర్వాత మిగిలిన వారికి 22 వ తేదీన ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీనిపై ఒక రోజు ముందుగానే ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా వివరాలు..
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,92,015 మంది 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. వీరికి 2,82,780 ఆల్బెండోజోల్ మాత్రలు అందుబాటులో ఉన్నాయి. రెండు డివిజన్ల పరిధిలతో పాటు 18 మండలాల్లోని 22 పీహెచ్సీలు, 5 యూపీహెచ్సీలు, 1టీబీ యూనిట్ ఉంది. ఇద్దరు వైద్యాధికారులు పర్యవేక్షణ కోసం డివిజన్ స్థాయిలో కేటాయించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు 48తో పాటు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు 1427 ఉండగా1256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, జన సముహాలుండే ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్న భోజన సమయంలో 1.30 గంటలకు పిల్లలకు ఈ మాత్రలు ఇవ్వాలి.
వైసీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి