బోథ్, సెప్టెంబర్ 11: ఇటీవల కురిసిన వానలతో చింతల్బోరి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అలుగు పారుతూ దిగువకు పరవళ్లు తొక్కుతున్నది. ఈ నీటిని చూసి ఆయకట్టు రైతాంగం ఆనందంలో మునిగితేలుతున్నది. ఈ యేడు వెయ్యి ఎకరాల్లో రెండో పంటకు ఢోకాలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చింతల్బోరి సమీపంలోని వాగుపై 1992-93లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.1.98 కోట్లతో ప్రాజెక్టును నిర్మించారు. కుడి, ఎడమ కాలువల ద్వారా 650 ఎకరాలకు నీరందించాలని సంకల్పించారు. అయితే కాలువల నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడంతో 300 ఎకరాలు కూడా నీరు పారలేదు. 2007లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టుకు గండిపడ్డది. అప్పటి పాలకులు కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ఆయకట్టుకు చుక్కనీరు అందేదికాదు. టీఆర్ఎస్ సర్కారు మిషన్ కాకతీయ కింద ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు, ప్రధాన కాలువల్లో సిమెంట్ లైనింగ్ పనులు చేసి పునరుద్ధరించింది. ఈ యేడు కురిసిన భారీ వర్షాలతో జూన్ నెలలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకింది. సెప్టెంబర్ మొదటి వారం మొదలైనా ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠ స్థాయిలోనే ఉన్నది. వానకాలం వేసిన సోయాబీన్, పత్తి, కంది, మినుము, పెసర పంటలకు ప్రస్తుతం నీటి తడులు అవసరం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరో నెల రోజుల్లో పత్తి మినహా మిగిలిన పంటలు పూర్తవుతాయని, యాసంగిలో శనగ, గోధుమ, మక్క తదితర పంటలు వేస్తామని తెలిపారు. ప్రాజెక్టు నిండి ఉండడంతో ఆయకట్టులోని చింతల్బోరి, సంపత్నాయక్తండా, పూల్సింగ్తండా, దేవులనాయక్తండా, పార్డీ(కే), పార్డీ(బీ) గ్రామాల రైతులకు నీరు పారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఆరెకరాల్లో పత్తి వేసిన..
ఆరెకరాల్లో పత్తి పంటను వేసిన. చేను ప్రధాన కాలువను ఆనుకొని ఉండడంతో పొలమంతా నీరు పారుతున్నది. పత్తికి రెండు, మూడు తడుల నీరు పారితే సరిపోతుంది. పంట బాగా కాయకపోతే తొలగించి మరో పంటను వేయడానికి నీళ్లు సరిపోతాయి. గతంలో కాలువలు సరిగా లేకపోవడంతో మా భూముల దాకా నీరందేది కాదు. ఇప్పుడు మస్తుగా నీళ్లు అందుతున్నాయి.
-రాథోడ్ ప్రకాశ్, రైతు, సంపత్నాయక్తండా
మా భూమికి నీరందుతున్నది….
మాకు మూడెకరాల భూమి ఉంది. బోరుబావి మోటర్ సైతం ఉంది. పక్క నుంచే కాలువలో నీరు పారుతుండడంతో మోటర్ అవసరం లేకుండా నీరందుతున్నది. పత్తి పంటకు నీరందడంతో పాటు పంట తొలగించి మళ్లీ జొన్న పంట వేయడానికి నీరు సరిపోతున్నది. ప్రాజెక్టు కట్టిన మొదట్లో మా భూమి వరకు నీరు రాకుండా మధ్యలోనే వాగులో కలిసేది. ఇప్పుడు మాత్రం నీరు వస్తున్నది.
-రాథోడ్ ఉత్తమ్సింగ్, రైతు, దేవులనాయక్తండా