ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ధూప, దీప నైవేద్యాలతో విశేష పూజలందుకున్న లంబోదరుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు. డప్పు చప్పుళ్ల హోరు, యువతీ యువకుల నృత్యాలు, కోలాటాలు, పిల్లల కేరింతల నడుమ శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. గణపతి బప్పా’ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వాగులు, చెరువులు, సమీప జలవనరుల్లో నిమజ్జనం చేసి వెళ్లిరా గణనాథ.. మళ్లీ రావయ్యా అంటూ సాగనంపారు. ఆయా చోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీలు ఉదయ్‌కుమార్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
– నిర్మల్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్/ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 9: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణాలు, పల్లెల్లో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాల శోభాయాత్రను భక్తులు ఘనంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్ల నడుమ యువతీయువకులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శోభాయాత్రను ప్రారంభించారు. ఉట్నూర్‌లో నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌లో నంబర్ 1 గణపతి వద్ద మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూజలు చేశారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో మంత్రి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.