ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 9: జోనల్ స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రా్రష్ట్రస్థాయి పోటీల్లోనూ గెలవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో ఉమ్మడి జిల్లాకు చెందిన 11 పాఠశాలల బాలికలకు నిర్వహించిన క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదన్నారు.
అందులో భాగంగా ఉన్నత విద్య, ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు బహుమతులు అందిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ట్రెనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంజేపీ ఆర్సీవో గోపీచంద్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగం, ఇన్చార్జి ప్రిన్సిపాల్ గీత, క్రీడాకారులు పాల్గొన్నారు.