ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్(నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 6 : ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. వృద్ధాప్యంతోపాటు ఇతర కారణాలతో బాధపడుతున్న అభాగ్యులకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నది. లబ్ధిదారుల వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించింది. వజ్రోత్సవాల్లో భాగంగా కొంత పింఛన్లు మంజూరు చేసి.. ఆగస్టు 15 నుంచి పింఛన్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ ఆరంభం నుంచి మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్లు స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో కలిసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఊరూరా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందిస్తుండడంతో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 70,613 మందికి ప్రయోజనం చేకూరనుంది.
కొత్త పింఛన్ల పంపిణీ పండుగలా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన వారికి అధికారులు మంజూరు పత్రాలు అందిస్తుండడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వయసు తగ్గించి పెన్షన్ ఇస్తుండడంతో ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరూరికి వెళ్లి పెన్షన్ మంజూరు పత్రాలు అందిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆసరా పెన్షన్ల గురించిన సంబురాలే కనిపిస్తున్నాయి.
ఇంటింటికీ పెద్ద కొడుకై..
సీఎం కేసీఆర్ ఆసరా పథకం కింద నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నారు. ఆసరా పెన్షన్ అందే ప్రతి ఇంటికీ పెద్ద కొడుకై నిలుస్తున్నాడు. గతంలో సాంఘిక భద్రత పెన్షన్ కింద ఇచ్చిన ఈ పథకం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా స్వరూపం మారిపోయింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3,016 చొప్పున, ఇతర లబ్ధిదారులకు రూ.2,016 చొప్పున పెంచి దిక్కులేని లక్షలాది కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే ఆసరా పెన్షన్ పొందాలంటే కనీస వయసు 60 ఏండ్లు ఉండాలనే నిబంధనను సీఎం కేసీఆర్ మార్చేశారు. 57 ఏండ్లు నిండితే చాలు ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి గత ఆగస్టు నుంచే శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు 57 ఏండ్లు ఉన్న వారిని గుర్తించి గత నెల నుంచి పెన్షన్ అందిస్తున్నారు.
వేలిముద్ర లేకపోయినా…
ప్రస్తుతం తపాలా శాఖ ద్వారా పింఛను బట్వాడా విధానంలో బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర తప్పనిసరి. వేలిముద్రను యంత్రం గుర్తించకపోతే పింఛను అందేది కాదు. అలాంటి వారు పంచాయతీ కార్యదర్శులను ఆశ్రయించాల్సి వచ్చేది. వేలిముద్ర సరిపోని అర్హులందరూ పంచాయతీ కార్యదర్శి బయోమెట్రిక్‌పై వేలిముద్ర వేయాల్సి వచ్చేది. కార్యదర్శులు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు పడేవారు. ఈ బాధల నుంచి విముక్తి కోసం కొత్తగా పంపిణీ చేసే గుర్తింపు కార్డుల వెనుకాల క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. వేలిముద్ర రాకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది.
మంత్రి, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధుల అందజేత
కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రొసిడింగ్ కాపీతోపాటు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నారు. పంద్రాగస్టున కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ఇప్పటికే నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి, కొండాపూర్, నర్సాపూర్(జి), దిలావర్పూర్, సారంగాపూర్ మండలాలతోపాటు నిర్మల్ పట్టణంలోని కొత్త పింఛన్‌దారులకు ప్రొసీడింగ్, గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. ముథోల్ నియోజకవర్గంలోని భైంసా, ముథోల్, లోకేశ్వరం మండలాల్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఐడీ కార్డులు ఇస్తున్నారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్-టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్లు ఊరూరా పర్యటిస్తూ స్థానిక సర్పంచ్‌లు, ఎంపీపీ, జడ్పీటీసీలతో కలిసి పత్రాలు అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎమ్మెల్యే జోగు రామన్న, మంచిర్యాల జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య మంజూరు పత్రాలు అందిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 63,805 మంది లబ్ధిదారులు ఉండగా.. కొత్తగా 15,474 మందికి పింఛన్లను మంజూరయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్‌లో 2,737 మందికి, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 895, బజార్హత్నూర్ 699, బేల 844, భీంపూర్ 666, బోథ్ 1096, గాదిగూడ 375, గుడిహత్నూర్ 743, ఇచ్చోడ 899, ఇంద్రవెల్లి 859, జైనథ్ 1471, మావల 124, నార్నూర్ 504, నేరడిగొండ 547, సిరికొండ 393, తలమడుగు 902, తాంసి 546, ఉట్నూర్ 1174 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. పాత, కొత్త వాటితో కలిపి లబ్ధిదారుల సంఖ్య 79,279 కి చేరింది. ప్రభుత్వం ప్రతినెలా రూ.17.56 కోట్లను పంపిణీ చేస్తున్నది.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 81,623 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ఇందులో వృద్ధులు 27,367, వితంతువులు 36,695, వికలాంగులు 11,499, చేనేత కార్మికులు 244, కల్లుగీత 873, బీడీ 2,325, ఒంటరి మహిళలు 2,358, బోదకాల బాధితులు 262 మంది లబ్ధిపొందుతున్నారు. వీరికి రూ.8.65 కోట్ల వ్యయం అవుతున్నది. కాగా.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ నుంచి మరో 22,127 మందికి వచ్చాయి. వీరికి రూ.4.46 కోట్లు వెచ్చించనుంది. దీనితో నూతన లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
22,127 కొత్త పెన్షన్లు..
మంచిర్యాల జిల్లాలో నూతనంగా 22,127 మందికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలంలో 1,721 మందికి, హాజీపూర్‌లో 919, లక్షెట్టిపేటలో 1,089, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 581, మంచిర్యాల మున్సిపాలిటీలో 2,159, నస్పూర్ మున్సిపాలిటీలో 1,235 మందికి పెన్షన్ మంజూరైంది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలంలో 834 మందికి, భీమినిలో 375, కన్నెపల్లిలో 542, కాసిపేటలో 816, నెన్నెలలో 708, తాండూరులో 935, వేమనపల్లిలో 491 మందికి, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 1,273 మందికి పెన్షన్ మంజూరైంది. చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం మండలంలో 497 మందికి, చెన్నూర్‌లో 1,062, జైపూర్‌లో 1,155, కోటపల్లిలో 1,189, మందమర్రిలో 273, చెన్నూర్ మున్సిపాలిటీలో 592, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 643, మందమర్రి మున్సిపాలిటీలో 954 మందికి పెన్షన్ మంజూరైంది. ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలంలో 2,084 మందికి ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 45,431 మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు 16,465, వికలాంగులు 5,548, వితంతువులు 19,765, చేనేత కార్మికులు 484, గీత 125, బీడీ 82, ఒంటరి మహిళలు 2,481, బోదకాల బాధితులు 481 మంది ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.10.35 కోట్లు అవుతున్నాయి. నూతనంగా 13,436 మందికి పెన్షన్స్ మంజూరయ్యాయి. ఇందులో వృద్ధులు 9,253, వితంతువులు 3,120, వికలాంగులు 694, నేత 26, గీత 14, బీడీ 5, ఒంటరి మహిళలు 195, బోదకాల బాధితులు 129 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.2.77 కోట్లు వెచ్చించనుంది.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 1,36,576 మంది లబ్ధిదారులకు సర్కారు రూ.30.37 కోట్లు చెల్లిస్తున్నది. కాగా.. 19 మండలాల పరిధిలో 19,576 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఇందులో వృద్ధులు 14,369, వితంతువులు 3,308, దివ్యాంగులు 1,380, చేనేత 14, గీత 39, బీడీ 290, ఒంటరి మహిళలు 176, బోదకాల వ్యాధిగ్రస్తులు 20 మందికి ప్రతినెలా అదనంగా రూ.4.82 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.
మండలాలవారీగా..
మండలాలవారీగా చూస్తే కొత్త పింఛన్‌దారులు బాసరలో 703, భైంసాలో 1,515, దస్తురాబాద్ లో 684, దిలావర్పూర్లో 481, కడెంలో 976, ఖానాపూర్‌లో 780, కుభీర్‌లో 1,412, కుంటాల లో 598, లక్ష్మణచాందలో 713, లోకేశ్వరంలో 1,251, మామడలో 933, ముథోల్‌లో 1,228, నర్సాపూర్(జి)లో 637, నిర్మల్‌లో 650, పెంబిలో 396, సారంగాపూర్‌లో 1,241, సోన్‌లో 687, తానూర్‌లో 1,293.. భైంసా మున్సిపాలిటీలో 1,715, నిర్మల్ పట్టణంలో 1,465, ఖానాపూర్ ప ట్టణంలో218 మందికి కొత్తగా మంజూరయ్యాయి.
పెద్ద కొడుకోలె భరోసానిచ్చిండు
చెన్నూర్, సెప్టెంబర్ 6 : 57 ఏండ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నరని చెబితే మీ సేవకు పోయి దరఖాస్తు చేసుకున్న. ఆసరా పింఛన్ మంజూరైందని రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు చెప్పిన్రు. పింఛన్ మంజూరు కార్డును ఇచ్చిన్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాలాంటోళ్లకు పింఛన్లు మంజూరు చేసి పెద్ద కొడుకులా భరోసాని స్తున్నడు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. – నూర్ఖాన్, చెన్నూర్
సర్కారుకు రుణపడి ఉంట..
భైంసా, సెప్టెంబర్ 6 : నాకూ ఆసరా పింఛన్ వచ్చింది. సర్కారు 57 ఏండ్లు దాటినోళ్లకు పింఛన్ ఇస్తందని తెలిసి దరఖాస్తు చేసుకున్న. గిప్పుడు నాకు పింఛన్ మంజూరు చేసినట్లు కార్డు ఇచ్చిన్రు. డబ్బులు ఎకౌంట్ల పడుతయని చెప్పిన్రు. సీఎం కేసీఆర్ సారు మాలాంటి పేదోళ్లందరికీ మంచి చేస్తున్నడు. ముసలోళ్లకు ఇబ్బందులు కలుగ కుండా నెలకు 2016 రూపాల పింఛన్ ఇస్తున్నడు. గతంలో ఏ ఒక్కలన్నా గింత మంచిగ చేసిన్ర. అభాగ్యులను ఆదుకున్న నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ సారు ఒక్కరే. నాకు పింఛన్ ఇస్తున్న ఈ సర్కారుకు ఎంతో రుణపడి ఉంట.
–ఎన్. శ్రీనివాస్, భైంసా
కేసీఆర్ సల్లంగుండాలె
బెల్లంపల్లి, సెప్టెంబర్ 6 : మాది పెద్దనపల్లి. ఇక్కడే ఉన్న రైస్ మిల్లులు పని చేస్త. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే పని దొరుకుతది. మిగతా ఎనిమిది నెలలు వట్టిగనే ఉండాల్సి వస్తది. నాకిప్పుడు 61 ఏండ్లు. ఇగ చేతన కూడా అవుతలేదు. పోయనేడాది దరఖాస్తు చేసుకున్న. పింఛన్ మంజూరైంది. కార్డు కూడా ఇచ్చిన్రు. ఇగ నా కష్టాలు తీరినట్లే. ప్రతి నెలా రూ.2016 వస్తయి. గీ డబ్బులతో భార్యా పిల్లలను సాదుకుంట. నా బతుక్కి భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగుండాలె.
– లింగంపల్లి బానయ్య, బెల్లంపల్లి