పల్లెల్లో ఏ నలుగురు కలిసినా 24 గంటల ఉచిత పవర్‌పై మాటలు
కేంద్రంలోకి కేసీఆర్ వెళ్తే అన్నదాతలు బాగు పడుతారని నమ్మకం
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 6 : “నిజామాబాద్ గడ్డ లక్ష్మీగడ్డ. ఇక్కడి నుంచి భారత రైతాంగ సోదరులకు ఒక తీయటి మాట అందిస్తున్న. తెలంగాణ మాదిరిగానే యావత్ భారత రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తాం. ఈ విషయాన్ని ఇక్కడి గడ్డ మీది నుంచి ప్రకటిస్తున్న.” అని సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తునానరు. రైతులు, రైతు సంఘాల నాయకులు స్వాగతించడంతోపాటు కేసీఆర్ నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. మా మాదిరిగానే భారతదేశంలోని రైతుల బతుకులు కూడా మారుతాయని.. ఆయన మాట ఇస్తే ప్రాణాలకు తెగించైనా నిలబెట్టుకుంటారని, కేసీఆర్ వైపే దేశ రైతాంగం చూస్తున్నదని తెలుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే.. చంద్రశేఖర్‌రావు మాత్రం రైతుల పక్షాన నిలబడుతున్నారు. తప్పకుండా దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.
నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ తరహాలో దేశంలోని 29 రాష్ర్టాల్లో ఉచిత కరెంటును అమలు చేస్తామన్న ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ పోరాటాన్ని ప్రజలతో కలిసి నిర్వహించిన కేసీఆర్ తెలంగాణ వచ్చాక 24 గంటల ఉచిత కరెంటుతోపాటు రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగరీథ, మిషన్ కాకతీయ, సాగునీటి రంగాల్లో విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఒకవైపు కేంద్రం వడ్లు కొనుగోలు చేయకపోవడం, మరోవైపు మోటార్లకు మీటర్లను బిగిస్తామని చెప్పడం, విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేయడం వంటి కుట్రలకు తెర తీస్తున్నదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో ఓ ఉద్యమ బాటను చేపట్టేందుకు బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో బీజేపీ యేతర ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత కరెంటు ఇస్తామని హామీ నివ్వడంపై సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి రైతాంగానికి 24 గంటల కరెంటు అమలు చేయడంతో రెండు పంటలు పండుతున్నాయి.
కేసీఆర్ వైపు దేశ రైతాంగం చూపు..
నిజామాబాద్ బహిరంగ సభలో వ్యవసాయ విధానంపై కేసీఆర్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా రైతులను ఆకర్శిస్తోంది. రైతులకు 24 గంటల కరెంటు అందించేందుకు కేవలం రూ.1.45 లక్షల కోట్ల వ్యయం అవుతోందని లెక్కలు వేసి చెప్పడంతో రైతుల దృష్టంతా కేసీఆర్‌పై పడింది. రైతు వ్యతిరేక విధానాలపై, మోదీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కేసీఆర్ భవిష్యత్‌లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉచిత కరెంటు అమలవుతోందని రైతులు, రైతు సంఘాల నాయకుల్లో విశ్వాసం ఏర్పడుతోంది. దేశంలోని ఆయా రాష్ర్టాల్లో ప్రస్తుతం రైతాంగానికి ఏడు గంటల నుంచి 9 గంటలు మాత్రమే కరెంటు ఇస్తుండగా.. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో తక్కువ కరెంటు రైతులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదేవిధంగా ఉచిత కరెంటు కోసం దేశంలో జీవనదులైన గంగ, గోదావరి, కావేరి, కృష్ణ తదితర నదులపై ప్రాజెక్టులు నిర్మాణమైతే జల విద్యుత్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో రైతులకు వ్యవసాయానికి సాగునీరు కూడా అందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
హామీ ఇస్తే నిలబెట్టుకుంటారు..
మాది కుంటాల మం డలంలోని అందకూర్ గ్రామం. నా వయస్సు 70 ఏండ్లు. 20 ఏళ్ల సంది ఎవుసం జేస్తన్న. 50 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాం. అప్పుట్లో బోర్లు, మోటార్లు ఉండేవి కావు. వర్షం పడితే పంట పండేది. లేకుంటే ఎండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతుకు పెట్టు బడి సాయం, 24 గంటల కరెంటు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేయడంతో రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల రెండు పంటలు పండుతున్నాయి. దేశంలో కూడా ఉచిత కరెంటు అమలు చేస్తే ఈ ముఖ్యమంత్రికి దేశంలో మంచి పేరు వస్తుంది.
– ఏశన్న, రైతు, అందకూర్, కుంటాల మండలం
రైతాంగానికి ప్రయోజనం..
మాది కుంటాల మండలంలోని ఓలా గ్రామం. నేను 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 24 గంటల కరెంటు అమలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుంది. ఒకప్పుడు ఒక్క పంట పండేందుకే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్రమోదీ పాలనపై పోరాటం చేస్తూ బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించడంతో రైతులకు ఎంతో మేలు చేకూరనుంది.
– ఎగ్గం గణేశ్, రైతు, ఓలా, కుంటాల మండలం
కేసీఆర్ నిర్ణయం సరైనదే..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలను యావత్ రైతాంగం వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ బహిరంగసభ వేదికగా.. తాము అధికారంలోకి వస్తే ఉచిత కరెంటును 24 గంటలు అమలు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అమలు చేస్తున్నారు. దేశంలో కూడా అమలు చేసేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయంతో ముందుకెళ్తే రైతు సంఘాల తరఫున పూర్తి మద్దతు ఇస్తాం.
– నంది రామయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు