ఎదులాపురం, సెప్టెంబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను సోమవారం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, విఘ్నేశ్వరుడి చిత్రపటంవద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ సమయంలో వైద్య సిబ్బంది విశేష సేవలందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి తగిన ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు. గతంలో మెరుగైన వైద్యసేవలందక ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో 100 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా బస్తీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల మాదిరిగా పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. మూడు వేలకు పైగా జనాభా ఉన్న, వైద్యసేవలు అవసరం ఉన్న ప్రాంతాల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రం జానీ, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, మున్సిపల్ కమిషనర్ శైలజ, వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లు, పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ అంజు తదితరులు పాల్గొన్నారు.