తెలంగాణ సర్కారు పేదల వైద్య ఖర్చులకు వెనుకాడడం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నది. గూడేలు, తండాలు, పల్లెల్లో మెరుగైన సేవలు అందించడానికి పీహెచ్సీలలో వైద్య సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులో పెట్టింది. వీటికితోడు పట్టణాలు, మున్సిపాలిటీల్లో కూడా ఖరీదైన చికిత్స అందించడానికి పూనుకుంది. ఇందులో భాగంగా తమ వాడలోనే ఉచితంగా సర్కారీ వైద్యం పొందడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీలో సోమవారం ఎమ్మెల్యే జోగు రామన్న బస్తీ దవాఖానను ప్రారంభించారు. మున్సిపాలిటీలోని రాంనగర్, దస్నాపూర్లలో బస్తీ దవాఖానలకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. సర్కారీ వైద్యం తమ ఇంటి ముందుకు రావడంపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వైద్యం సరిగా అందక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోనే వారు. వానకాలం, ఇతర సీజనల్ వ్యాధులు ప్రజలను పట్టిపీడించేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులతో గ్రామాలకుగ్రామాలే మంచం పట్టేవి. సరైన వైద్యం అందక మరణాలు కూడా సంభవించేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలోని వైద్యసేవలకు పెద్దపీట వేసింది. పట్టణాలు, పల్లెలు, గిరిజన గూడేల్లోని ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నది. జిల్లాలోని శిథిలావస్థలో ఉన్న దవాఖానల భవనాలను నిర్మించడంతో పాటు వైద్యులు, నర్సులు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల నియామకం చేపట్టింది. ప్రతి దవాఖానలో ప్రజలకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నది.
మహిళలు గర్భం దాల్చినప్పుటి నుంచి ప్రసవం పొందే వరకు అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నది. సర్కారు దవాఖానల్లోనే గర్భిణులు ప్రసవం పొందితే అమ్మఒడి పథకంలో భాగంగా మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలతో పాటు తల్లీబిడ్డల సంరక్షణలో భాగంగా రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నది. ప్రభుత్వం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. కరోనా పరీక్షలు, చికిత్సలతో పాటు ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ రిమ్స్‌లో మోకాలి ఆపరేషన్లను సైతం నిర్వహిస్తున్నారు.
బస్తీ దవాఖానలతో ఇంటిముందు వైద్యం..
అన్ని రకాల వైద్యసేవలు ఉచితంగా అందుతుండడంతో సర్కారు దవాఖానలకు వచ్చే పేదల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీలో బస్తీ దవాఖానను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో 7,8 వార్డుల్లోని 8 వేల మంది పేదలకు సర్కారు వైద్య చేరువైంది. ఇక్కడ వైద్యులు, నర్సు, మరో సిబ్బంది ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దవాఖాన తీసి ఉంటుంది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించి, మందులు పంపిణీ చేస్తారు. వ్యాధి తీవ్రతను గుర్తించి పట్టణ ఆరోగ్య కేంద్రానికి గానీ, రిమ్స్‌కు గానీ రెఫర్ చేస్తారు. దవాఖాన తమకు సమీపంలో ఉండడంతో ప్రజలు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యం తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు, వైద్యసేవలు అందడంతో పేదలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రైవేటు దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చు చేయకుండా ఉంటుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాంనగర్, దస్నాపూర్‌లో సైతం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. సర్కారు వైద్యం తమ ముంగిట్లోకి రావడంపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు ఎంతో ఉపయోగం..
పట్టణ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేదలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతాయి. పేదలు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యం చేయించుకుంటారు. వైద్యులు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రిమ్స్‌కు పంపించేలా చూస్తారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు బస్తీ దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నరేందర్ రాథోడ్,జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్