నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 5 : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ సోమవారం పట్టణంలోని మంజులాపూర్‌లో ఎల్ఐసీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మంత్రి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కోసం కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజలను పన్నులపై పన్నుల భారం మోపుతున్నదని దుయ్యబట్టారు. రైల్వే, పోస్టల్, బ్యాకింగ్, విమానయానం, బీస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌కు దారాదత్తం చేసే కుట్ర పనునతున్నదని ఆరోపించారు. కార్మికులందరూ ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని సూచించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే రామన్న..
స్థానిక ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఏజెంట్లకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మద్ద తు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని నిర్వీర్యం చేసేలా కొత్త చట్టాలను తీసుకువచ్చి, ఉద్యోగుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. వెంటనే పాలసీదారులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని, ఏజెంట్లకు బోనస్ పెంచాలని, లోన్‌పై వడ్డీ తగ్గించాలని డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఏజెంట్ యూనియన్ అధ్యక్షుడు రాంచంద్రా రెడ్డి, నాయకులు ఉష్కం నర్సింగ్, సాయిని రవి కుమార్, ఆశన్న, దిగంబర్ పాటిల్, ఊశన్న, దీపక్, హిరాలాల్ తదితరులు పాల్గొన్నారు.