నేరడిగొండ, సెప్టెంబర్ 4 : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. మండలంలో ఎంపిక చేసిన 14 పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు మంజూరు చేసిన రూ.30 లక్షలతో పనులు చేపడుతున్నారు. తాగునీరు, కరెంట్ సౌకర్యం, చిన్నచిన్న మరమ్మతులు, ప్రహరీ, వంటగది, డైనింగ్‌హాల్, మరుగుదొడ్ల నిర్మాణాలు వంటివి చేస్తున్నారు. అదనపు తరగతి గదులు అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించనున్నారు.
వేగంగా పూర్తి చేస్తే మేలు…
మండలంలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు మన ఊరు – మన బడితో తీరనున్నాయి. తాగునీరు, వంటగదులు, మరుగుదొడ్లకు ఇబ్బందులు పడుతున్న పాఠశాలల్లో పనులు చేస్తున్నారు. మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో పనులు పూర్తికావచ్చాయి. త్వరలోనే రెండో విడుత చేపట్టేందుకు ఆస్కారం ఉంది. ప్రహరీల నిర్మాణం పూర్తయితే పశువుల బెడద తప్పనుంది. విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని 14 పాఠశాలలు మొదటి విడుత మన ఊరు – మన బడికి ఎంపికయ్యాయి. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరడిగొండ, తేజాపూర్, కుమారి, వడూర్. ప్రాథమికోన్నత పాఠశాల తర్నం(కే), బుగ్గారం(బీ), వడూర్(ఉర్దూ). ప్రాథమిక పాఠశాల వాంకిడి, మథురతండా, నేరడిగొండ, వడూర్, బొందిడి, తేజాపూర్, కుమారి ఉన్నాయి. కాగా అన్నింటిలో పనులు వేగంగా చేస్తున్నారు. తాగునీటి నల్లాల ఏర్పాటు, నీటి సంపు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేరడిగొండ, తేజాపూర్, వడూర్ పాఠశాలల్లో నీటి సంపు పనులు పూర్తి కావచ్చాయి.
తొలగనున్న సమస్యలు
మండలంలో మన ఊరు -మన బడి కింద మంజూరైన పనులు వేగంగా సాగుతున్నాయి. మండలంలో 14 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో పాఠశాలల్లోని సమస్యలు తొలగనున్నాయి.
–అన్రెడ్డి భూమారెడ్డి, ఎంఈవో, నేరడిగొండ