మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 4 : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం,‘రైతు బీమా’తో వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది. ఒక్కొక్కరికీ ప్రీమియం చెల్లిస్తూ, ఏదేని కారణంతో మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందించి అండగా నిలుస్తున్నది. ఈ నాలుగేళ్లలో వివిధ కారణాలతో 1508 మంది మృత్యువాత పడగా, రూ.75.40 కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఐదో దఫాకు 88,286 మందిని అర్హులుగా గుర్తించగా, 64,154 మందిని అనర్హులుగా ప్రకటించింది.
రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2018, ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించగా, ఐదోసారి అమలు చేస్తున్నది. ప్రమాదవశాత్తు, సహజ మరణమైనా బాధిత రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ. 5 లక్షలు చెల్లిస్తున్నారు.
88,286 మంది అర్హులు
ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు మంచిర్యాల జిల్లాలో 1,52,440 మంది పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులు ఉన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. జిల్లా వ్యవసాయాధికారి కల్పన ఆదేశాల మేరకు 18 మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను సర్వే చేసి ఈ ఏడాదికి 88,286 మంది రైతు బీమాకు అర్హులుగా గుర్తించారు. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులు 18,579 ఉండగా, ఎస్టీలు 7,183, 62,524 మంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన రైతులున్నారు. ఎన్ఆర్ఐలు, 18 ఏండ్లలోపు వారు, 59 ఏండ్లు దాటిన వారు, ఇతర గ్రామాల్లో భూమి ఉన్న రైతులు 64,154 మంది ఉన్నారని, వీరందరూ ఈ పథకానికి అనర్హులుగా గుర్తించారు.
నాలుగేండ్లలో రూ. 75.40 కోట్లు అందజేత
తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ నాలుగేండ్లలో ప్రమాదవశాత్తు, సహజ, తదితర ప్రమాదాలలో బీమాకు అర్హులైన 1,508 మంది రైతులు మరణించారు. వీరి కుటుంబాలకు(నామినీకి) ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.75.40 కోట్ల బీమా చెల్లించింది. అది కూడా రైతు మరణించిన వారంలోనే చెల్లించి ఆ కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం అండగా నిలిచింది.
సమాచారం అందించాలి..
ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే ఆ సమాచారాన్ని ఏఈవోకు లేదా ఏవోకు తెలియజేయాలి. మృతి చెందిన రైతు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు పట్టాదారు పాసుబుక్, ఆధార్, నామినీ ఆధార్, నామినీ బ్యాంకు అకౌంట్ వివరాలు అందజేస్తే రైతుబీమా కోసం వెంటనే ఆ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. రూ.5 లక్షలు నేరుగా నామినీ అకౌంట్లో జమవుతాయి.
–కల్పన, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల