కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 4(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో లాభదాయక పంటలను ప్రోత్సహించాలని చూస్తున్నది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నది. సేద్యంపై ఆధారపడి జీవించే రైతులకు నష్టం కలుగకుండా చర్యలు చేపడుతున్నది. అన్నదాతలకు బహుళ ప్రయోజనాలు కల్పించాలనే సంకల్పంతో రైతువేదికలను ఏర్పాటు చేసింది. వరికి బదులుగా వాణిజ్య, కొత్తరకం, కూరగాయలు, పొద్దు తిరుగుడు, నువ్వు పంటలను ప్రోత్సహించాలని సూచిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వ్యవసాయ క్లస్టర్లలో రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించేందుకు రైతువేదికలను సర్కారు నిర్మించింది. వీటిలో క్లస్టర్లవారీగా సమావేశాలు నిర్వహించి వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పత్తి, కంది, సోయాతోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నష్టాలు లేని మేలైన పంటల గురించి వివరించేందుకు వ్యవసాయశాఖ సమాయత్తమవుతున్నది. వ్యవసాయ అధికారులతోపాటు శాస్త్రవేత్తలతో వచ్చే యాసంగింలో సాగు చేయాల్సిన పంటలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఉచిత విద్యుత్, చెరువుల పునరుద్ధరణతో పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రాగా.. యాసంగి పంటలకు నీటి కొరత లేకుండాపోయింది. కొత్తరకాల పంటలు, కూరగాయలు వేసే విధంగా అవగాహన కల్పించనున్నారు. కొత్త రకం వాణిజ్య పంటలను ప్రోత్సహించనున్నారు. నష్టాలు లేకుండా కూరగాయల సాగు, వాణిజ్య పంటల కింద నూనె గింజలను సాగు చేసే విధంగా ఆయిల్ పాం, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి తదితర పంటలను వేయాలని సూచించనున్నారు.
లాభదాయక పంటలపై అవగాహన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 70 క్లస్టర్ల పరిధిలో రైతులకు అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే యాసంగిలో లాభదాయకమైన పంటలను పండించటమే లక్ష్యంగా ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి. వచ్చే యాసంగిలో లాభదాయకమైన పంటలు వేసేలా వ్యవసాయ అధికారులు కార్యక్రమాలు చేపట్టనున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా సోయా, వేరుశనగ, శనగ, మక్కజొన్న, కూరగాయలు పండించేలా రైతులను ప్రోత్సహించనున్నారు. తక్కువ కాలంలో పంటలు చేతికి వ చ్చే స్వల్పకాలిక పంటలను వేయాలని అధికారులు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నారు. తక్కువ నీటి వినియోగం తో త్వరగా పంటలు ఇంటికి రావడంతోపాటు రైతుల కు మంచి లాభాలను తెచ్చిపెట్టేలా పంటలను వేయాలని, స్వల్పకాలిక పంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతోపాటు మంచి డిమాండ్ ఉన్న పంటలు వేసే విధంగా అవగాహన కల్పించనున్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వచ్చే యాసంగింలో రైతులకు లాభాలను తెచ్చే పంటల ను ప్రోత్సహించేందుకు రైతు వేదికల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఆసిఫాబాద్ డివిజన్లో రైతులు యాసంగిలో కూరగాయల పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. కాగజ్‌నగర్ డివిజన్లో రైతులు బోర్ల కింద వరి అధికంగా వేస్తున్నారు. దీంతో అధికారులు కాగజ్‌నగర్ డివిజన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించి పంటల మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా వరి సాగు తగ్గించేలా చర్యలు చేపట్టనున్నారు.