ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి జడ్పీ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కటుకం మధూకర్ విజ్ఞానశాస్త్రంలో నిత్య పరిశోధకుడిగా పేరు సంపాదించుకున్నాడు. విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించడం, నూతన ఆవిష్కరణల వైపు మళ్లించడంలో ఈయనకు పెట్టింది పేరు. ఈయన అందించిన ప్రోత్సాహంతో అనేక మం ది విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లలో పాల్గొని ప్రశంసలు పొందారు. మినీ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న మధూకర్ విద్యార్థి చనకపూరి సాయికుమార్ బెస్ట్ ఇంటరాక్షన్ అవార్డు అందుకున్నాడు. ఈయన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు సప్తగిరి చానల్లో నిర్వహించే క్విజ్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచారు.
వేంపల్లికి చెందిన విజయ్‌కుమార్ వరంగల్‌లోని ఎన్ఐటీలో ఇంటర్న్‌షిప్ సాధించి నెల రోజులపాటు శిక్షణ పొందాడు. రాజీవ్ విద్యామిషన్(హైదరాబాద్) వారి ఆధ్వర్యంలో రచించిన ‘బోధన వ్యూహాలు- కరదీపిక’లో భాగస్వాములయ్యారు. జిల్లా విద్యాశాఖ రూపొందించిన ‘సామర్థ్యాలు-సాదిద్ధాం’ అనే కరదీపికల(తెలుగు, గణితం,సైన్స్)కు సమన్వయకర్తగా వ్యవహరించారు. రాజీవ్ విద్యామిషన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, పలు శిక్షణా కార్యక్రమాలకు జిల్లా, రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. జాతీయ హరితదళం జిల్లా కో-ఆర్డినేటర్‌గా ప్రతి పాఠశాలలో ‘బడితోట’ను పెంచడానికి కృషి చేశారు. 2019లో న్యూ ఢిల్లీలో నిర్వహించిన 7వ జాతీయ స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో రాష్ట్ర బృందానికి లీడర్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలల ప్రతినిధులకు మార్గదర్శిగా ఉన్నారు.
జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులు, డీఈవోకు సమన్వయకర్తగా.. తెలుగు సాహితీ సదస్సులో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ సామల సదాశివ పద్య సంకలనం ‘సదాశివ స్మృతి సుధా’ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో గూగుల్ మీట్ ద్వారా బోధన చేసి ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిర్పూర్ నియోజకవర్గ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ కమిటీ కన్వీనర్‌గా, తెలంగాణ జేఏసీ నాయుకుడిగా, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఫిబ్రవరి 27, 2020లో సైన్స్ సేవారత్న అవార్డును అందుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోనున్నారు.
నిత్య విద్యార్థినే..
నేను ఇప్పటికీ నిత్య విద్యార్థినే. ఎన్నో పరిశోధనలు చేస్తున్నా ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించి ఎగ్జిబిషన్లలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నా. జిల్లాలోని సైన్స్, గణితం ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సహకరించడం వల్ల లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నా. నాకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతున్న. ఇందులో నాకు ఆనందం ఉంది. – కటుకం మధూకర్, జిల్లా సైన్స్ అధికారి