బేల, ఆగస్టు 30 : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జైనథ్ సీఐ నరేశ్ కుమార్ సూచించారు. బేలలోని పోలీస్ స్టేషన్లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మంగళవారం అన్ని మతాల పెద్దలు, సర్పంచ్‌లు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. విగ్రహం ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ కృష్ణకుమార్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, ఆగస్టు 30 : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రూరల్ సీఐ రఘుపతి సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అన్ని గ్రామాల యువకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్ఐలు కేశవ్స్వామి, గణపతి, సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ రఘు పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 30 : ఎవరికీ ఆటంకం కలగకుండా భక్తిశ్రద్ధలతో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని నార్నూర్ సీఐ ప్రేమ్‌కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండపాల వద్ద ఏర్పాటు చేసే సౌండ్ సిస్టంలో భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే ప్రసారం చేయాలన్నారు. ఇతరులకు ఇబ్బంది పెడితే మండపాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. మండపాల్లో విద్యుత్ సౌకర్యానికి విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు.