బోథ్, ఆగస్టు 30: మండలంలోని కౌఠ (బీ) గ్రామం శబరిమాత నామస్మరణతో మార్మోగిం ది. 30 రోజుల పాటు నిర్వహించిన అఖండ జ్యోతి మాసోత్సవం మంగళవారం ముగిసింది. వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. శ్రావణ మాసం ప్రారంభం రోజున తలమడుగు మండలం పల్లి గ్రామం నుంచి శబరిమాత భక్తులు ఇక్కడికి అఖండ జ్యోతిని తీసుకు వచ్చారు. ఆశ్రమంలో నిత్యం పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి సంకీర్తనలు ఆలపించారు. చివరి రోజు అమ్మవారి చిత్రపటాన్ని ట్రాక్టర్‌పై ఉంచి స్వామిజీలు శోభాయాత్ర నిర్వహించారు. పల్లకీలో మాతాజీ పాదుకలను ఉంచి మహిళలు ఊరేగింపు చేశారు. అనంతరం ఆశ్రమంలో అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి, పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఎమ్మెల్యే సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామిజీల ఆధ్వర్యంలో ఆశ్రమంలో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. శివానందభారతీ స్వామిజీ ప్రవచనాలు బోధించారు. కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు పీ లక్ష్మీనారాయణరెడ్డి, బీ ప్రభాకర్‌రెడ్డి, ఏ ధర్మారెడ్డి, బీ రాజేశ్వర్, జగదీశ్, బాపురెడ్డి, గంగయ్య, దిగంబర్, మహిళలు పాల్గొన్నారు.
బోథ్ ఎమ్మెల్యే దంపతుల పూజలు…
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, వందన దంపతులతో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పూజలు నిర్వహించారు. వీరిని ఆశ్రమ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్, ఏఎంసీ చైర్మన్ డీ భోజన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు ఉన్నారు.
రూ. 5 లక్షలు మంజూరు
కౌఠ (బీ) శబరి మాతాజీ ఆశ్రమ అభివృద్ధికి రూ. 5 లక్షలు ఎంపీ ల్యాడ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ సోయం బాపురావు ప్రకటించినట్లు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు జీ రాజుయాదవ్ తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేస్తున్నట్లు ఫోన్ ద్వారా తెలిపినట్లు రాజు యాదవ్ పేర్కొన్నారు.