ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండవర్గాలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి. ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. వృద్ధాప్యంతోపాటు ఇతర కారణాలతో బాధపడుతున్న వారికి చేయూతనంది స్తున్నాయి. పింఛన్ లబ్ధిదారుల వయస్సును ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 సంవత్సరాలకు కుదించింది. వజ్రోత్సవాల్లో భాగంగా కొంత పింఛన్లు మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 15,474 మందికి, నిర్మల్ జిల్లాలో 19,576 మందికి ప్రయోజనం చేకూరింది. రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. సర్కారు అందిస్తున్న సాయంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకూ ప్రయోజనం చేకూర్చుతున్నాయి. ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఆసరా లబ్ధిదారులత వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించిన ప్రభుత్వం.. వజ్రోత్సవాల్లో భాగంగా నూతన పింఛన్లు మంజూరు చేసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో 15,474, నిర్మల్ జిల్లాలో 19,576 మందికి ప్రయోజనం చేకూరింది. సర్కారు అందిస్తున్న సాయం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అభాగ్యులకు అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, బీడి కార్మికులకు ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. పింఛన్ అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. కొవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా క్రమం తప్పకుండా పింఛన్ డబ్బులు మంజూరు చేసింది. సర్కారు అందిస్తున్న సాయంతో వృద్ధులకు కుటుంబంలో గౌరవం పెరుగడంతో పాటు మందులు, ఇతర అవసరాలకు డబ్బులు ఉపయోగపడుతున్నాయి.
రెండు జిల్లాల్లో 2,35,231 మంది లబ్ధిదారులు
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏండ్ల నిండిన వారికి వజ్రోత్సవాల్లో భాగంగా ఆసరా పింఛన్లు మంజూరు చేశారు. గతేడాది ఆగస్టులో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వీటి పరిశీలనకు ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 63,805 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తగా మరో 15,474 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. నిర్మల్ జిల్లాలో 1,36,376 మంది లబ్ధిదారులు ఉండగా మరో 19,576 మందికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో ఆసరా లబ్ధిదారుల సంఖ్య రెండు జిల్లాల్లో 2,35,231కు చేరింది. వారికి ప్రతి నెలా రూ.51.97 కోట్లు మంజూరవుతున్నాయి. కొత్తగా మంజూరైన పింఛన్ పత్రాలను స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.