నిర్మల్ అర్బన్, ఆగస్టు 28: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలోని రైతులను రాజులను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అటవీ, పర్యావణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన నిర్మల్ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చిలుక రమణ, వైస్ చైర్మన్‌గా శ్రీకాంత్ యాదవ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. భూమిని నమ్ముకొని జీవించే రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. రైతు బీమాతో ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అక్కడి రైతులకు ఇలాంటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు ఆకర్షితులై పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రాంత ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారని గుర్తు చేశారు.
భారీ బైక్ ర్యాలీ..
మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్, డైరెక్టర్లు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పద్మశాలీ, యాదవ కుల సంఘ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రికి, పాలక వర్గ సభ్యులకు సన్మానాలు
మంత్రి అల్లోలతో పాటు మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని టీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు, జిల్లాలోని పద్మశాలీ, యాదవ కుల సంఘాల సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఎమెల్సీ విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నల్ల వెంకట్ రాంరెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, రవి కిరణ్ యాదవ్, అల్లోల గౌతంరెడ్డి, సురేందర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, సుభాష్‌రావు, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, అడ్ప విజయలక్ష్మీ పోశెట్టి, సర్పంచ్‌లు,ఎంపీటీసీలు, ఆలయ కమిటీల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహావిష్కరణ
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 28: నిర్మల్ పట్టణంలో రాజ్‌పుత్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహారాణా ప్రతాప్ సింగ్ భారీ విగ్రహాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. అంతకుముందు రాజ్‌పుత్ సంఘం జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రాజ్‌పుత్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌సింగ్, ఉపాధ్యక్షుడు అనిల్, కోశాధికారి సుశీల్, సభ్యులు నారాయణసింగ్, కిషన్‌సింగ్, చందూలాల్సింగ్, హీరాసింగ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.