ఇచ్చోడ, ఆగస్టు 27 : ప్రభుత్వ స్కూళ్లు పచ్చ తోరణంతో దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బృందావనాలను తలపిస్తున్నాయి. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. పచ్చని చెట్లతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు చల్లని గాలితో విద్యార్థులను ఉత్తేజ పరుస్తున్నాయి. ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నట్లు పాఠశాలలు ఆహ్లాదాన్ని పంచుతూ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
విద్యార్థుల వివరాలు..
మండలంలో మొత్తం 78 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 6 జిల్లా పరిషత్ సెకండరీ, 5 రెసిడెన్సియల్, మిగతావి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మొత్తం విద్యార్థుల సంఖ్య 6253. ఇందులో బాలికలు 3852, బాలురు 2401 చొప్పున ఉన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తుండడంతో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఆకర్షణీయమైన మొక్కలు ….
ప్రభుత్వ పాఠశాలల్లోని ఆవరణల్లో టేకు, వేప, కానుగ, సీతాఫలం, నేరేడు, ఖర్జూర, ఉసిరి, కరివేపాకు, అశోక చెట్లతో పాటు రంగు రంగుల పూల మొక్కలు, నీడ నిచ్చే మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచారు. దీంతో ఆయా పాఠశాలల ఆవరణ మొత్తం పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.
నిరంతరం సంరక్షణ …
హరితహారంలో భాగంగా నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. పాఠశాలల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా హరిత సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి, వారికో ఉపాధ్యాయుడిని ఇన్చార్జీగా కేటాయించారు. నిత్యం మొ క్కలకు నీరు పడుతున్నారు. వాటి చుట్టూ గడ్డిని తొలగిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పర్యావరణం, పచ్చదనం, మానవ మనుగడపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు.
బాధ్యతగా తీసుకున్నాం…
పాఠశాలల్లోని మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఉపాధ్యాయులు మాకు కేటాయించిన మొక్కల సంరక్షణకు నిత్యం కృషి చేస్తున్నాం. మొక్కలకు నీరు పట్టడం, వాటి చుట్టూ పెరిగిన గడ్డిని తొలగిస్తూ సంరక్షిస్తున్నాం.
గోగరి పోశాని, పదో తరగతి విద్యార్థి(కోకస్మన్నూర్)
ఆహ్లాదాన్ని పంచుతున్నాయి…
మా పాఠశాల ఆవరణలో మూడేళ్ల క్రితం హరితహారంలో మొక్కలు నాటాం. అవి నేడు ఏపుగా పెరిగాయి. పాఠశాల ఆవరణలోకి రాగానే ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బాగా చదువుకోవడానికి కూడా మొక్కలు దోహదపడుతున్నాయి.
కదం రోహిత్ ఎనిమిదో తరగతి విద్యార్థి కోకస్మన్నూర్)
సమష్టి కృషితోనే….
మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విడుతల వారీగా వేలాది మొక్కలు నాటాం. నాటిన మొక్కలను సంరక్షించుకుంటున్నాం. వీటి సంరక్షణ కోసం కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక వాచ్మెన్లను నియమించాం. మొక్కల సంరక్షణకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేస్తున్నారు.
రాథోడ్ ఉదయ్రావ్, ఎంఈవోఇచ్చోడ