ఎదులాపురం/ఉట్నూర్,ఆగస్టు 28: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్లో కలిసి మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,477 మంది అభ్యర్థులకు గాను 15,619 మంది హాజరయ్యారు. 858 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలకు నోడల్ ఆధికారిగా వ్యవహరిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పరీక్షను పూర్తిచేశారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమా మహేశ్వరరావు, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, జీ మల్లేశ్, జే కృష్ణమూర్తి, కే మల్లేశ్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, ఆగస్టు 28 : నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను పరీక్షా కేంద్రాలను అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 10014 మంది దరఖాస్తు చేసుకోగా 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9421 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాల తనిఖీ
జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఎస్పీ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలతో పాటు పలు కళాశాలలను తనిఖీ చేశారు. అభ్యర్థులకు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులు, పరీక్ష నిర్వహించే విధానాన్ని తెలుసుకున్నారు. ఎస్పీ వెంట పరీక్షల కన్వీనర్ పీజీ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంనర్సింహా రెడ్డి ఉన్నారు.