ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 27 : ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. వాస్తవానికి గతంలోనే బయోమెట్రిక్ హాజరు అమలు చేసినా కొవిడ్ వల్ల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రెండేండ్ల అనంతరం ఆయా యంత్రాలకు టెక్నీషియన్లు మరమ్మతు చేశారు. దీంతో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా నిర్ణీత సమయానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సమయ పాలన పలు విమర్శలకు దారితీస్తున్నది. నిర్ణీత సమయానికి హాజరుకావడం లేదని రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 13జిల్లాల్లో బయోమెట్రిక్ పరికరాల ద్వారా ఉపాధ్యాయుల హాజరును సేకరించారు. జిల్లాలో సుమారు 638 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికాలను గతంలో పంపిణీ చేసి హాజరుతీసుకున్నారు. అయితే, కరోనా వలన రెండేండ్లుగా బయోమెట్రిక్ పరికరాల ద్వారా హాజరు బంద్ చేశారు. తిరిగి వచ్చే నెల నుంచి హాజరును నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు తప్పని సరిగా పాఠశాలకు ఉదయం 9.35గంటల్లోగా హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత హాజరును బయోమెట్రిక్‌లో నమోదు చేయాలి.
వేళలు పాటించాల్సిందే..
జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదని ఆరోపణలున్నాయి. బయోమెట్రిక్ బంద్ కావడంతో చాలా మంది జిల్లా కేంద్రం నుంచి ఉదయం 9.30గంటల తర్వాత పాఠశాలలకు వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1నుంచ ఉదయం 9.35గంటలకే పాఠశాలకు చేరుకుని బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే.