ఆదిలాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో వ్యాధుల నివారణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది పల్లెల్లో ఇంటింటా తిరుగుతూ అనారోగ్యంతో బాధపడుతున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి ఇంటి వద్దే చికిత్సలు అందించడంతో పాటు తీవ్రతను బట్టి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కూడా మున్సిపాలిటీ, పంచాతీల అధికారులు, సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. దోమలు వ్యాపించకుండా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉండడంతో, ఐటీడీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఎప్పటికప్పుడూ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాధుల నియంత్రణ, తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వైద్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో ప్రస్తుతం జ్వరాలు అదుపులో ఉన్నాయి.
స్వైన్‌ఫ్లూ కేసుల నేపథ్యంలో..
గత పది రోజుల వ్యవధిలో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పుల లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. వీరు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు హెచ్1, ఎన్1 వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. పందుల నుంచి ఈ వైరస్ సోకుతుంది. కాగా, గ్రామాల్లో వైద్యశాఖ సిబ్బంది ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. జ్వరాలు వచ్చిన గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, బాధితుల శాంపిళ్లు సేకరించి హైదారాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్( ఐపీఎం)కు పంపిస్తున్నారు. పాజిటివ్ కేసులకు చికిత్సలు అందించడానికి రిమ్స్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో 13 బెడ్లను ఏర్పాటు చేసి, వైద్యులు, సిబ్బందితో పాటు మందులను అందుబాటులో ఉంచారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వ దవాఖానలకు వచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు కోరుతున్నారు. స్వైన్‌ఫ్లూ వచ్చిన వారికి సాధారణ చికిత్సతో నయం చేయవచ్చునని చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
కరోనా లాగే స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పుల లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వారు దవాఖానలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. బాధితుల వద్ద నుంచి శాంపిళ్లు సేకరించి నిర్ధారణ కోసం హైదరాబాద్‌కు పంపిస్తున్నాం. పరీక్షలు ఇక్కడే చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరడం జరిగింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి, నీరు, పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్