ఎదులాపురం, ఆగస్టు 27 : పార్కులను ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ బీట్ దుర్గానగర్ సెక్టార్‌లోని నర్సరీ, నీటి కుంటలు, నీలగిరి ప్లాంటేషన్, మావల పార్కులోని నెమలి, కుందేలు కుంటలను కలెక్టర్ సందర్శించారు. దుర్గానగర్‌లోని ఆటవీ శాఖ నర్సరీలో మొక్కలు, ఎరువు తయారీని పరిశీలించారు. కంపార్టెంట్ 250లో 20హెక్టార్ల పరిధిలోని సెమీ మెకానికల్ ప్లాంటేషన్, 249, 250లోని ప్రాంతాలను సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ పరిశీలించారు. రూ.82లక్షలతో నిర్మించిన నీటి కుంటను పరిశీలించి నీటి నిల్వ, తదితర వివరాలను జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మావల పార్క్‌లోని వాచ్ టవర్ పైనుంచి దుర్గానగర్ కంపార్ట్మెంట్లు, మావల పార్క్‌ను వీక్షించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్ సింగ్, బీట్ ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.