నార్నూర్/ఇంద్రవెల్లి/బోథ్, ఆగస్టు 27 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, ఇంద్రవెల్లి, బోథ్ మండలాల్లోని గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో శనివారం బొడగ పండుగను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజు ఈ పండుగ జరుపుకోవడం సంప్రదాయం. తెల్లవారుజామున వాయిద్యాల చప్పుళ్లతో ‘జాగే మాతారీ’ అని నినాదాలు చేసుకుంటూ వెదురుకర్రలు(ఖోడంగ్) గ్రామ శివారుకు తీసుకువెళ్లి సంప్రదాయ పూజలు చేశారు. ప్రతి ఇంటి నుంచి తీసుకువచ్చిన పిండి వంటలను వనదేవతకు నైవేద్యంగా సమర్పించిన అనంతరం సామూహికంగా భుజించారు. వనమూలికలు, ఔషధాలను సేకరించి ఇంటికి తీసుకెళ్లారు. బోథ్ మండలంలోని పార్డీ (కే) గ్రామంలో గ్రామ పటేల్ సిడాం అమృత్రావు, ఐటీడీఏ డైరెక్టర్ మేస్రం భూమన్న, దేవరి ఆడెం జైతు, మహాజన్ మేస్రం మదన్, మంతు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.