రైతన్నల అతిపెద్ద పండుగ పొలాల అమావాస్యను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చెరువులు, వాగుల్లో బసవన్నలకు స్నానాలు చేయించి, అందంగా అలంకరించిన అన్నదాతలు వాటితో శోభాయాత్రగా ఆలయాలకు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం అందించారు. అనంతరం పెద్దలకు మొక్కులు చెల్లించి ఇంటిల్లిపాది కలిసి విందు ఆరగించారు. జైనథ్ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగురామన్న-రమా దంపతులు, జైనూర్ మండలం పాట్నాపూర్లో అదనపు కలెక్టర్ చాహత్ భాజ్పాయి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ నెట్వర్క్, ఆగస్టు 26: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల కొమ్ములకు రంగులు దిద్ది, కాళ్లకు గజ్జెలు కట్టి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. పిండి వంటలను ఎడ్లకు తినిపించారు.
పలు గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు ఎడ్లకు పూజ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, తాంసి, బేల, జైనథ్, ఇచ్చోడ,నేరడిగొండ, భీంపూర్, సిరికొండ, తలమడుగు, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలు, నిర్మల్ జిల్లాలోని భైంసా, లోకేశ్వరం, కుంటాల, ముథోల్, కుభీర్, తదితర మండలాల్లో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు. భైంసాలో ఎడ్లతో నిర్వహించిన శోభాయాత్రలో ఏఎస్పీ కిరణ్ ఖారే పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పొలాల పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, లింగాపూర్ జైనూర్, సిర్పూర్-యు మండలాల్లో శ్రావణమాసం చివరి రోజు కావడంతో ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సంప్రదాయంగా పూజాసామగ్రితో హనుమాన్, శివాలయాలకు వెళ్లి ఎద్దులతో ప్రదక్షిణలు చేయించారు.
గ్రామాలో పటేల్ సమక్షంలో ఎడ్లకు సామూహిక పూజలు చేశారు. జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ చాహత్ భాజ్పాయి ముఖ్య అథితిగా పాల్గొన్నారు. బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం అందించారు. ప్రదక్షిణల్లో విజేతలుగా నిలిచిన ఇద్దరు రైతులకు ప్రథమ, ద్వితీయ బహుమతి అందించారు. బసవన్నలకు ప్రత్యేక పూజలు చేశారు.