నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 28న న జరుగనున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7న ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించగా.. అదే స్ఫూర్తితో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఎస్పీ ప్రవీణ్ కుమార్ పోలీసు అధికారులు, పరీక్షల పర్యవేక్షకులు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశమై సమీక్షించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
– నిర్మల్ అర్బన్, ఆగస్టు 26
పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్మల్ జిల్లాలో 10,014 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 16,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు, ఆదిలాబాద్ జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనున్నది. ఆయా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, బెంచీలు.. అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్మల్ జిల్లాలో 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31మంది పరిశీలకులు, 417మంది ఇన్విజిటేటర్లును నియమించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపనున్నది.
పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష సమాయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పైలటింగ్కు పాల్పడే అవకాశం లేకుండా ముందుగానే అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్రలు నమోదు చేసుకుని పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు. చేతులకు గోరింటాకు, మెహందీ పెట్టుకుంటే వేలిముద్రలు సరిగ్గా పడక అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. హాల్టికెట్ వెనుక ప్రచురించిన నిబంధనలు పాటించాలి. ప్రతిభను నమ్ముకుని పరీక్షకు హాజరుకావాలి. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.
– ప్రవీణ్ కుమార్, ఎస్పీ, నిర్మల్