ఎదులాపురం, ఆగస్టు 25 : స్వచ్ఛ భారత్ మిషన్ ప్లస్ కార్యక్రమంలో ఎంపికైన గ్రామాల్లో అంతర్గత పరిశీలన నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 117 గ్రామాలు స్వచ్ఛ భారత్ మిషన్ ప్లస్‌గా ఎంపికయ్యాయని, వాటిని పరిశీలించడానికి మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయా బృందాలు సెప్టెంబర్ 10వరకు ఇంటింటికీ వెళ్లి పరిశీలించి ప్రతి రోజూ సాయంత్రం నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాకు కొత్తగా మంజూరైన 15,474 ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తించిన గ్రామాల్లో 33,873 గృహాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో గణపతి, అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీఎంవో శ్రీధర్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
ఉట్నూర్, ఆగస్టు 25 : ఆశ్రమాల్లో విద్యార్థుల ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఆమె సందర్శించారు. వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న వైద్యం, విద్య గురించి ఆరాతీశారు. అధికారులతో మాట్లాడుతూ వర్షకాలంలో వసతిగృహంలో డ్రైడే నిర్వహించి శుభ్రత చేపట్టాలన్నారు.
తాసీల్దార్ భోజన్న, ప్రధానోపాధ్యాయుడు మాణిక్‌రావు పాల్గొన్నారు.
బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి
ఇంద్రవెల్లి, ఆగస్టు 25 : బృహత్ పల్లె ప్రకృతి వనాలతోపాటు ఎంఎల్ఏపీ ప్లాంటేషన్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మండలంలోని ధనోరా(బి), గౌరాపూర్, శంకర్‌గూడ, ముత్నూర్, ఈశ్వర్‌నగర్, ఏమాయికుంట, ఇంద్రవెల్లిలోని బృహత్ పల్లె ప్రకృతి వనాలను గురువారం సాయంత్రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గౌరాపూర్లో పల్లె ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, ఈజీఎస్ అధికారులు జాదవ్ శ్రీనివాస్, సంతోష్ జైస్వాల్, గణేశ్ పాల్గొన్నారు.