బాసర, ఆగస్టు 25 : రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్.. పాదయాత్రకు బదులు మోకాళ్ల యాత్ర చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ర్టానికి రావాల్సిన వాటా తీసుకురావాలి. బీజేపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై బీజేపీ నాయకుల ఆరోపణలు సబబు కాదని, ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదని, రాష్ట్రంలో టీ ఆర్ఎస్ బలగం 60 లక్షలు ఉన్నారని, తిప్పికొడితే ఎటో పోతారన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలోని వి ద్యార్థులు సంయమనం పాటించాలని, భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని, వారికి అమ్మలా చెప్తున్నాని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నదని, విద్యార్థి ఆత్మహత్యకు తన సంతాపాన్ని ప్రకటించారు.
అమ్మవారి సన్నిధిలో మంత్రి
సరస్వతీ అమ్మవారిని మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో తన మనవరాలు కియారా రాథోడ్‌కు అమ్మవారి సన్నిధిలో అక్షరశ్రీకార పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెను సన్మానించి అమ్మవారి ప్రతిమ, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్యాం, ఆలయ ఈవో సోమయ్య ఉన్నారు.
టీఆర్ఎస్ నాయకుల వినతి
మంత్రికి సర్పంచ్ లక్ష్మణ్‌రావు బాసర మండ ల కేంద్రంలో ఐదు అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవన నిర్మాణాలతోపాటు, శిశు సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.