ఆదిలాబాద్, ఆగస్టు 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబా ద్, నిర్మల్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. శుక్రవారం ఆదిలాబాద్ మల్టీపర్పస్ గ్రౌండ్లో ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు యూనిస్ అక్బానీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా, నటరాజ్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావుతో పాటు ఆర్మీ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను ఎగురవేశారు. 75కిలోల కేక్‌ను కట్ చేశారు. ఆర్మీ, ఆర్మీ రిటైర్డు అధికారులు, దేశ రక్షణలో భాగంగా మరణించిన సైనికుల కుటుంబాలను జడ్పీ చైర్మన్, అధికారులు సన్మానించారు. దేశభక్తిని పెంపొందిం చేలా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని కేఆర్కే కాలనీలో వృద్ధాశ్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అంతకు ముందు జిల్లా జైలును సందర్శించి రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రయదర్శిని స్టేడియంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నిర్మల్‌లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, చెస్, అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓమౌజయహ యునైటెడ్ యంగ్ స్టార్ ఆధ్వర్యంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి 75 మీటర్ల జాతీయ జెండాతో ఫ్రీడం ర్యాలీని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలతో పాటు వృద్ధాశ్రమంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పండ్లు పంపిణీ చేశారు. భైంసా ఏరియా దవాఖానలో రోగులకు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పండ్లు పంపిణీ చేశారు.