నిర్మల్ టౌన్, ఆగస్టు 6 : స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని గుర్తు చేశారు. అందుకే తమ ప్రభుత్వం జాతీయత ఉట్టిపడేలా 33 జిల్లాల్లో వజ్రోత్సవాలను వారం పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. 16న సామూహిక గీతాలాపన, 17న రక్తదాన శిబిరాలు, 18న క్రీడల నిర్వహణ, 19న దవాఖానలు, జైళ్లు, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ చేయాలన్నారు. 20న ముగ్గుల పోటీలు, 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. 22న అన్ని జిల్లాల్లో ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మున్సిపల్ అధికారులతో సమావేశం..
మున్సిపల్ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వరద నష్టంపైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగురవేసేలా చూడాలన్నారు. 12న జాతీయ సమైక్య రక్షాబంధన్ టెలికాస్ట్ చేయాలని మంత్రి అల్లోల సూచించారు.
జయశంకర్ సార్‌కు నివాళి..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జాబీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.