హాజీపూర్, ఆగస్టు 6 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు జిల్లా లో దేశ భక్తి చాటేలా కార్యక్రమాలను నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా అటవీశాఖ అధికారి శివాని డోగ్ర, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీసీసీ అఖిల్ మహాజన్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, అధికారులతో వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభిస్తారని, ఈ నెల 22 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, రైస్మిల్లర్ సంఘం అధ్యక్షుడు నల్మాసు కాంతయ్య, మున్సిపల్ చైర్పర్సన్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సినిమా థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శించాలి
ఆజాది కా అమృత్ మహాత్సవ్ -75 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సినిమా థియేటర్ల యజమానులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మొదటి విడుత, రెండో విడుత 16 నుంచి 21 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ చిత్రం ప్రదర్శించాలన్నారు. థియేటర్లలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు.