మహిళల్లో ఎముకలు బలహీన పడుతున్నాయి. 30 ఏళ్ల నుంచే సాంద్రత కోల్పోతున్నాయి. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే.. ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఎముకలకు పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 30 ఏళ్ల వయస్సు అనేది.. మహిళల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. వారి శరీరంలో ఎముకల సాంద్రత పెరగడం ఆగిపోయి.. క్రమంగా తగ్గడం మొదలయ్యేది ఈ దశలోనే. ఈ పరిస్థితిని ‘సైలెంట్ బోన్లాస్’ అని అంటారు. ఎందుకంటే.. ఎముకలు బలహీనపడుతున్నా ఎటువంటి నొప్పి, లక్షణాలు ఉండవు. ఎముక విరిగినప్పుడే.. సమస్య తీవ్రత బయటపడుతుంది.
సాధారణంగా మనిషి శరీరం 25 నుంచి 30 ఏళ్ల వరకు మాత్రమే ఎముకలను నిర్మిస్తుంది. ఆ తర్వాత కొత్త ఎముక కణాల తయారీ కంటే, పాత ఎముక కణాలు కరిగిపోయే వేగం పెరుగుతుంది. ఇక ఎముకల బలాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. 30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో, ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఇక సరైన వ్యాయామం లేకపోవడం, క్యాల్షియం, విటమిన్ డి లాంటి పోషకాల లోపం వల్ల ఎముకలు గుల్లబారుతాయి. అన్నీ కలిసి ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తాయి.
ఎముకలు బలంగా ఉండాలంటే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిందే! ఆరోగ్యకరమైన ఎముకలు కావాలంటే, క్యాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్, ఆకుకూరలు, గింజలు, రాగులు, బాదం పప్పులు లాంటి పదార్థాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. అవసరమైతే వైద్యుల సిఫారసు మేరకు సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. ఇక క్రమం తప్పని వ్యాయామం అలవాటు చేసుకోవాలి. నడక, జాగింగ్, యోగాలాంటివి ఎముక సాంద్రతను మెరుగుపరుస్తాయి. విటమిన్ డి కోసం.. ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాలు ఉదయం ఎండలో ఉండటం అలవాటుగా మార్చుకోవాలి. అదే సమయంలో ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడం కూడా తగ్గించాలి. ఎందుకంటే, వీటివల్ల శరీరంలో క్యాల్షియం శోషణకు అంతరాయం కలుగుతుంది. ఇక దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. యోగా, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులతో ఒత్తిడిని చిత్తు చేసుకోవాలి.