కూకట్పల్లిలో కోటి రూపాయల దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హవాలా డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ తానే డబ్బులు తీసుకుని తనపై దాడిచేయించుకుని డబ్బులు కొట్టేశాడు. ఖుస్రుద్దీన్ ద్విచక్రవాహనంపై రూ.కోటి నగదు తరలిస్తుండగా నలుగురు అగంతకులు అడ్డగించి కళ్లలో కారంచల్లి వారి వద్ద ఉన్న కోటి నగదును లాక్కుని పరారయ్యారు. ఖుస్రుద్దీన్ ఎనిమిదిమందితో కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డారు. కాజేసిన డబ్బు వేరొకరికి ఇచ్చి లక్నో పారిపోయేందుకు రూ.5లక్షలతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. పోలీసులు శంషాబాద్లో వీరిని అరెస్ట్ చేసి రూ.77.30లక్షలు, రూ.39,195విలువగల విమాన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశామని డీసీపీ రితిరాజ్ తెలిపారు.
సిటీబ్యూరో/కూకట్పల్లి, మార్చ్17(నమస్తే తెలంగాణ): రూ.కోటి హవాలా డబ్బుపై కన్నేశాడు. ఎలాగైనా చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేశారు. ఎనిమిది మందితో కలిసి తన ప్రణాళికను అమలు పరిచాడు. తనపైనే దాడి చేయించుకుని రూ.కోటి కొట్టేసి వెళ్లిపోయే క్రమంలో పోలీసులకు చిక్కాడు. కూకట్పల్లిలో జరిగిన దారిదోపిడీ కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించారు. మోటార్ సైక్లిస్టుల నుంచి రూ.కోటి దోచుకున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దోపిడీ సొమ్ములో రూ.77లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు బృందాలుగా ఏర్పడి సీసీటీవీ కెమెరాల ఫుటేజి, ఫోన్ లొకేషన్స్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారు ఎక్కడికి వెళ్లారన్నది పసిగట్టి, శంషాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒమర్ షరీఫ్, హౌస్సద్దాం, హమీద్, ఖుస్రుద్దీన్ ఉన్నారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ చెప్పిన వివరాల ప్రకారం హవాలా డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ ఒక పథకం ప్రకారం తానే డబ్బులు తీసుకుని తానే దాడిచేయించుకుని డబ్బులు కొట్టేశాడు. మార్చి 16న రాత్రి పిల్లర్ నెం.836 వద్ద ఈ దారిదోపిడీ ఘటన జరిగింది.
హైదరాబాద్ పాతబస్తీలోని బహుదూర్పురాకు చెందిన ఖుస్రుద్దీన్ ద్విచక్రవాహనంపై రూ.కోటి నగదు తరలిస్తుండగా గుర్తుతెలియని నలుగురు అగంతకులు వారిని అడ్డగించి కళ్లలో కారం చల్లి వారి వద్ద ఉన్న రూ.కోటి నగదును లాక్కుని పరారయ్యారు. పోలీసుల దర్యాప్తులో దోపిడీకి మూలకారణం ద్విచక్రవాహనంపై ఉన్న ఖుస్రుద్దీన్ అని తేలింది. ఖుస్రుద్దీన్ మరో 8మందితో కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డారు. ఖుస్రుద్దీన్ ఇచ్చిన సమాచారంతోనే వారిని అడ్డుకుని కళ్లల్లో కారం చల్లి నిందితులు దోపిడీ చేశారు.
కాజేసిన డబ్బు వేరొకరికి ఇచ్చి లక్నో పారిపోయేందుకు రూ.5లక్షలతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు శంషాబాద్లో వీరిని అరెస్ట్ చేసి రూ.77.30లక్షలు, రూ.39,195విలువగల విమాన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలో పాల్గొన్న 9మందిలో నలుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ రితిరాజ్ తెలిపారు. రూ.కోటి ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆరా తీస్తున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని రితిరాజ్ పేర్కొన్నారు.