స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యాన్ని కార్పొరేట్‌స్థాయిలో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. సర్కారు దవాఖానల్లో కనీవినీ ఎరుగని రీతిలో వసతులు కల్పించారు. ఈ క్రమంలోనే మాతా శిశు మరణాల రేటు తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 2017 జూన్‌లో ‘కేసీఆర్ కిట్-అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి సుఖ ప్రసవం తర్వాత బిడ్డతో సహా ఇంటికి చేరే దాకా ప్రభుత్వమే అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆరేళ్లలో 23,935 కిట్లను పంపిణీ చేయగా, అమ్మ ఒడి కింద రూ.23 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
నిర్మల్,ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించింది. కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే ఉండే అత్యాధునిక పరికరాలను కూడా సమకూర్చడంతో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ దవాఖానలపై ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 2017 జూన్‌లో ‘కేసీఆర్ కిట్-అమ్మ ఒడి’ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో గతంలో కంటే ప్రసవాల సంఖ్య కూడా పెరిగాయి. ఇక్కడ కాన్పు చేయించుకున్న వారికి 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌తో పాటు అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తున్నది.
జిల్లాలో 23,935 కిట్ల పంపిణీ…
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 23,935 కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కాగా గతంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నెలకు 100నుంచి 150 ప్రసవాలు జరుగగా, కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి జిల్లాలోని దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 600కు పైగా పెరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఆరేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానల్లో ఇప్పటి వరకు 30700 ప్రసవాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
మౌలిక వసతులు.. ఆధునిక పరికరాలు
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. మొదటి విడుతలో భాగంగా దవాఖానలో గర్భిణీగా నమోదు చేసుకోవడంతో పాటు కనీసం రెండు సార్లు వైద్య పరీక్షలు, టీటీ ఇంజిక్షన్, ఐరన్ మాత్రలు తీసుకుంటే రూ.3వేలు అందజేస్తారు. అలాగే రెండో విడుతలో భాగంగా ప్రసవం అయిన వెంటనే ఆడపిల్ల పుట్టినట్లయితే రూ.5 వేలు, మగ బిడ్డ పుడితే రూ 4వేల సహాయాన్ని అందజేయడంతో పాటు రూ. రెండు వేల విలువైన కేసీఆర్ కిట్‌ను ఇస్తారు. అదే విధంగా మూడో విడుతలో భాగంగా పిల్లలకు 3నెలల కాలంలో వేయాల్సిన టీకాలన్నీ వేసిన తరువాత రూ.2 వేలు, నాలుగో విడుతలో భాగంగా పిల్లలకు సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు వేయించిన తర్వాత రూ.3వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు.
సాధారణ ప్రసవాలపై అవగాహన..
మహిళలు గర్భం దాల్చిన వెంటనే సమాచారం అందుకున్న ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు వారి వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లోని వైద్యులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సుఖ ప్రసవాలే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు. కోత ఆపరేషన్లు వద్దని, సాధారణ ప్రసవాలే శ్రేయస్కరమని గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప వైద్యులు ‘సిజేరియన్’ ఆపరేషన్ చేయడం లేదు.
తొలి కాన్పుకు రూ.50వేలు ఖర్చైంది..
మాది పెంబి మండలం మందపెల్లి గ్రామం. వారం రోజుల క్రితం పురిటి నొప్పులతో ప్రభుత్వ దవాఖానలో చేరిన. రెండో కాన్పులో ఈనెల ఒకటిన పాప పుట్టింది. పుట్టిన రెండో రోజే కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. కిట్‌లో అవసరమైన అన్ని వస్తువులు ఉన్నయ్. తొలి కాన్పు నిర్మల్‌లోనే ప్రైవేటు దవాఖానలో చేయించుకున్న. అప్పుడు రూ.50వేల వరకు ఖర్చయ్యింది. ఇక్కడి ప్రభుత్వ దవాఖానలో రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం చేసిన్రు. సదుపాయాలు కూడా చాలా బాగున్నయ్. -బైరెడ్డి రాధిక, మందపెల్లి, పెంబి మండలం
ప్రసవాలు పెరిగాయి..
నిరుపేదలు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఖర్చులతో వైద్య సేవలు పొందలేరు. ప్రస్తుతం సర్కారు దవాఖానలు బలో పేతం కావడం, గర్భిణులకు అన్ని రకాల వసతులు కల్పించడం, కేసీఆర్ కిట్లను అందజేయడంతో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది. అలాగే అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సాధారణ ప్రసవాలు పెరిగాయి. మా దవాఖానలో ప్రతి నెలా దాదాపు 300 ప్రసవాలు అవుతున్నాయి. ప్రస్తుతం 70 శాతం వరకు సాధారణ ప్రసవాలే చేస్తున్నాం. గతంలో 80 నుంచి 90శాతం వరకు సిజేరియన్లే జరిగేవి. వైద్యారోగ్య శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇది మంచి పరిణామం.
– డాక్టర్ సరోజ, గైనకాలజిస్ట్, ప్రసూతి దవాఖాన, నిర్మల్
గర్భిణులకు మెరుగైన సేవలు..
జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ దవాఖానలో గర్భిణులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇక్కడికి వచ్చే గర్భిణులకు అత్యాధునిక సదుపాయాలతో పాటు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. ప్రతి రోజూ ఎంత మంది గర్భిణులు ప్రసవాల కోసం వచ్చినా ఒకే సారి ప్రసవాలు చేయగలిగే వసతులు దవాఖానలో ఉన్నాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు అవసరమైన చికిత్సలు అందించేందుకు ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్) వార్డును ఏర్పాటు చేసి 16 ఇంక్యుబేటర్లను అమర్చడం జరిగింది. ఇలాంటి సదుపాయాలు కేవలం కార్పొరేట్ దవాఖానల్లోనే ఉంటాయి.
– డాక్టర్ ఏ.దేవేందర్‌రెడ్డి, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలు
కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నది. కోట్లాది రూపాయలను కేటాయించి ఆధునిక వైద్య పరికరాలను అందజేసింది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో జిల్లాలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటితో పాటు 102 సేవలు, జ్వర సర్వే, హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ ధన్‌రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, నిర్మల్