ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణం, ఆధునీకరణ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతు, చెక్‌డ్యాంల నిర్మాణాలను చేపట్టింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రైతులు సాగు చేస్తున్న పంటలకు రెండు సీజన్లలో అవసరమైన సాగునీరు అందుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వానకాలంలో ప్రాజెక్టుల్లో ఆయకట్టు రైతులకు అవసరమమైన సమయంలో సాగునీరు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుటున్నది. దీంతో ఏటా వానకాలంలో కురుస్తున్న వర్షాలతో రెండు జిల్లాల్లోని ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వానకాలం ప్రారంభమైన 45 రోజుల్లోనే ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయి. రెండు జిల్లాల్లోని జూలై నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 550.3 మిల్లీ మీటర్లకు గానూ 1039.9 మిల్లీ మీటర్లు, నిర్మల్ జిల్లాలో 1201.3 మిల్లీ మీటర్లకు గానూ 523.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అధికారులు నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్నారు.
57 వేల ఎకరాలను సాగునీరు
ప్రాజెక్టుల గరిష్ఠ నీటిమట్టానికి చేరడంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలోని 57 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలు, తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు పరిధిలోని 8,500, నిర్మల్ జిల్లా గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద 14 వేలు, సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు పరిధిలో 11 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 284.70 మీటర్ల వరకు నీరు ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా 0.843 టీఎంసీల నీరు ఉంది. మత్తడి ప్రాజెక్టు పూర్తస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు గానూ 276.60 మీటర్ల నీరు ఉంది. మత్తడి నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీలకు గానూ 0.457 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గడ్డెన్న వాగు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 357.60 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.852 టీఎంసీలకు 1.326 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 360.56 మీటర్లకు ప్రస్తుతం 359.56 మీటర్ల మేర నీరు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.484 టీఎంసీలకు 1.242 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గడ్డెన్న ప్రాజెక్టుతో ప్రయోజనం
నిర్మల్ జిల్లా భైంసా పరిసర ప్రాంతాల రైతులకు గడ్డెన్న ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది. యేటా ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతున్నది. ఈసారి బాగా వానలు పడడంతో తొందరగా నిండింది. నాకు నాలుగెకరాలు ఉండగా.. పత్తి, సోయా వేశా. యాసంగిలో శనగ, మక్క వేస్తా. అధికారులు పంటలకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేస్తారు.
– సాయన్న, రైతు, భైంసా
యాసంగి సాగుకు నీరు..
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ద్వారా యేటా ఆయకట్టు పరిధిలోని 14 వేల ఎకరాలకు సాగు నీరు అందుతు న్నది. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి రైతులకు రెండు పంటలకు నీరు అందుతున్నది. నాకు మూడెకరాలు ఉండగా యేటా వానకాలం, యాసంగిలో పంటలు వేస్తా. సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ యేడాది కూడా రెండు పంటలకు ఢోకా లేదు. – సతీష్, రైతు, భైంసా.
స్వర్ణమ్మతోనే రెండు పంటలు
స్వర్ణమ్మ పూర్తిగా నిండితేనే ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండుతయ్, నాకు ప్రాజెక్టు కింద నాలుగెకరాల భూమి ఉంది. రెండు సీజన్లలో వరి పండిస్త. ఈసారి వర్షాలు ఫుల్లుగా పడ్డయ్. దేవుడు కరుణించడంతో స్వర్ణమ్మ పూర్తిగా నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది కూడా ఇగ పంటలకు ఢోకా లేదు. ఆయకట్టు రైతులకు చేతినిండా పని ఉంటది.
-బుర్ర సురేశ్, రైతు, స్వర్ణ
ఆయకట్టుకు ఢోకా లేదు..
స్వర్ణ ప్రాజెక్టులో ఫుల్లు నీళ్లున్నయ్. ఇగ ఈసారి ఆయకట్టులో పంటలకు ఢోకా లేదు. రైతులందరూ చాలా సంతోషపడుతున్నరు. ఇప్పటికే వరినాట్లు వేసే పనుల్లో ఉన్నరు. నాకు కూడా ప్రాజెక్ట్ కింద మూడెకరాల భూమి ఉంది. ఈ సారి కూడా వరినే సాగు చేస్త. వర్షాలు మస్తుగ పడినయ్. స్వర్ణమ్మ నీటితో కళకళలాడుతున్నది. రెండు పంటలకు సరిపడా నీళ్లు కనపడుతున్నయ్. ఇగ రైతుకు రంది లేదు.
-కాల్వ సాయన్న, రైతు
ఈసారి తొందరగా ప్రాజెక్టు నిండింది..
ఈ యేడాది భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు తొందరగా నిండింది. దీంతో రెండు పంటలు వేసుకునే అవకాశం లభించింది. నాకు నాలుగెకరాలు ఉండగా.. పత్తి, సోయా వేశా. యాసంగిలో శనగ సాగు చేస్తా. ప్రాజెక్టు కాలువలకు అధికారులు మరమ్మతులు చేయడంతో మాకు సాగునీరు లభిస్తున్నది.
– సందీప్, రైతు, ఆనందపూర్, జైనథ్ మండలం