ఇంద్రవెల్లిలో రూ. 4 లక్షలతో పరిశ్రమ ఏర్పాటు చేసిన బామ్నే రవికాంత్
ఇంద్రవెల్లి, జూలై 29 : ఆ రైతు సొంతంగా దాల్మిల్ ఏర్పాటు చేసి సక్సెస్ సాధించాడు. ప్రతి నెలా రూ. 30 వేల వరకు ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండల కేంద్రానికి చెందిన రైతు రవికాంత్ బామ్నేకు 10 ఎకరాల భూమి ఉంది. 8 ఎకరాల్లో పత్తి తో పాటు సోయాబీన్, ఇంతర పంటలు వేశాడు. రెండెకరాల్లో కందులు సాగు చేస్తున్నాడు. ఓ వైపు వ్యవసా యం చేసుకుంటూనే ఏదైన పరిశ్రమ నెలకొల్పాలి అనుకున్నాడు. ఇంకేముంది 2020లో హైదరాబాద్లోని అవర్ ఫుడ్ ఫార్మర్ ఫ్రాంచైజీ కంపెనీ సహకారంతో ఐడీసీసీ బ్యాంక్ ద్వారా రూ. 4 లక్షల రుణం తీసుకొని బామ్నే బాబా దాల్ మిల్ ఏర్పాటు చేశాడు. ప్రతి నెలా బ్యాంకుకి ఈఎంఐ రూ.14 వేలు చెల్లిస్తున్నాడు.
ఈ మిల్లులో ప్రతి నెలా సుమారు 20 నుంచి 60 క్వింటాళ్ల వరకు కంది పప్పు తయారు చేస్తున్నాడు. ఇందుకోసం తన రెండెకరాల్లో కందులు కూడా సాగు చేశాడు. 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బయట రైతుల వద్ద కూడా కందులు కొనుగోలు చేస్తూ మిల్లు (నాలుగు నెలలు మాత్రమే)లో పప్పు పడుతున్నాడు. అవర్ ఫుడ్ ఫార్మర్ ఫ్రాంచైజీ కంపెనీ వారికే కందిపప్పును అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రతి 15 రోజులకోసారి వచ్చి పప్పు తీసుకెళ్తారు. మార్కెట్లో ఉన్న ధర ప్రకారమే తనకూ డబ్బు లు చెల్లిస్తారని, ప్రతి నెలా బ్యాంకుకు కట్టే డబ్బులు పోగా, రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు రవికాంత్ చెబుతున్నాడు.
ప్రతి నెలా రూ. 30 వేల ఆదాయం
సొంతంగా కంది పప్పు తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేసిన. ఇక్కడ పట్టించిన పప్పును హైదరాబాద్లోని అవర్ ఫుడ్ ఫార్మర్ ఫ్రాంచైజీ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకున్న. రూ. 2 లక్షల విలువైన కం దులను కొనుగోలు చేసి పప్పుగా మార్చి అమ్మితే రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుంది.
– రవికాంత్ బామ్నే, రైతు ఇంద్రవెల్లి