కడెం, జూలై 29 : అధిక వరదల కారణంగా కడెం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు పాక్షికంగా దెబ్బతిని ఆపరేటింగ్ సమస్య తలెత్తింది. జలాశయం ఖాళీ అవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు అధికారులు గేట్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పంటలకు నీరందుతుందని ఆశిస్తున్నారు. శుక్రవారం 6 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 8 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, 678.775 అడుగులు (3.303టీఎంసీలు)గా ఉంది.
డ్యామ్‌పై రాకపోకల నిలిపివేత..
కడెం వంతెన మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించారు. రహదారి కోత నేపథ్యంలో తాత్కాలికంగా వంతెన మీదుగా సాగుతున్న రాకపోకలు నిలిపేయాలని ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లే వాహనాలు ఖానాపూర్, నుంచి జగిత్యాల మీదుగా చేరుకోవాలి. అలాగే మంచిర్యాల, జన్నారం, గుడిహత్నూర్ మీదుగా నిర్మల్ వైపు వెళ్లాలని తెలిపారు. అత్యవసరాల కోసం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రాజెక్టు పైన పనులకు ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతో రాకపోకలు నిలిపేశారు.