బోథ్, జూలై 29 : ఇంటి చుట్టూ పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మలేరియా విభాగం ఇచ్చోడ సబ్ యూనిట్ అధికారి రవీందర్ అన్నారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని సాయినగర్‌లో ఇంటింటికీ తిరిగి నిల్వ నీటిని పారబోశారు. ట్యాంకులు, డ్రమ్ములు, పాత టైర్లు, గుంతల్లో నీటి నిల్వ మూలంగా దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సొనాల పీహెచ్సీ సూపర్వైజర్ నర్సింహస్వామి, ఏఎన్ఎం లలిత, హెచ్ఏ గోవర్ధన్, ఆశకార్యకర్త పద్మ పాల్గొన్నారు.
నార్నూర్, జూలై 29 : గాదిగూడ మండలం సావ్రి గ్రామంలో పీహెచ్సీ వైద్య, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహించారు. పరిసరాల శుభ్రత పాటించాలని గ్రామస్తులకు సూచించారు. న్నారు. అనంతరం పున్నగూడ, దాబా(కే) గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్, ఆరోగ్య అసిస్టెంట్ సంజయ్, ఏఎన్ఎంలు శ్రీదేవి, రత్న, సురేఖ, సులోచన, కల్పన, సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
నేరడిగొండ, జూలై 29 : పరిసరాల పరిశుభ్రత పాటించడంతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఎంపీవో శోభన పేర్కొన్నారు. మండలంలోని తర్నం గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ప్రజలకు వ్యాధులు వ్యాప్తి చెందుతున్న తీరుపై అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విశాల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, జూలై 29 :మండలంలోని పొన్నారి గ్రామంలో డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆకుల భూమయ్య తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. గ్రామంలో ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, ఉపసర్పంచ్ అశోక్, పంచాయయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.