రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా గొల్లకుర్మలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించేందుకు సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత గొర్రెల పంపిణీతో సత్ఫలితాలు రాగా, త్వరలోనే రెండో విడుత కార్యక్రమం చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించిన నేపథ్యంలో, నిర్మల్ జిల్లాలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపడుతున్నది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 7199 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 6886 మందిని అర్హులుగా గుర్తించింది.
నిర్మల్ టౌన్, జూలై 27: నిర్మల్ జిల్లాలో రెండో విడుత కింద గొర్రెల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 18 మండలాల్లో 7199 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇందులో మంది 6886 మందిని అర్హులుగా గుర్తించి, మరో 313 మందిని అనర్హులుగా పేర్కొంది. డీడీలను చెల్లించేందుకు వారం రోజుల గడువు ఇవ్వడంతో పశు సంవర్ధకశాఖ అధికారులు అన్ని గ్రామాల గొల్లకుర్మలను చైతన్యపరిచి లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రి తలసాని ఆదేశాలతో..
జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీడీలను స్వీకరించిన తర్వాత గొర్రెల పంపిణీ చేపట్టడం జరుగుతుందని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. నిర్మల్ కార్యాలయంలో పశు వైద్యాధికారులతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కాగా, ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 6,886 మంది డీడీలు చెల్లించారు. ఇందులో బాసరలో 250, భైంసాలో 478, దస్తురాబాద్‌లో 407, దిలావర్పూర్లో 180, కడెం పెద్దూర్లో 409, ఖానాపూర్‌లో 434, కుభీర్‌లో 733, కుంటాలలో 279, లక్ష్మణచాందలో 326, లోకేశ్వరంలో 525, మామడలో 352, ముథోల్‌లో 552, నర్సాపూర్ (జి)లో 225, నిర్మల్ రూరల్‌లో 399, పెంబిలో 100, సారంగాపూర్‌లో 442, సోన్‌లో 212, తానూరులో 683 మంది డీడీలు చెల్లించారు.
పెరిగిన సబ్సిడీతో ఆర్థిక ప్రయోజనం…
మొదటి విడుత కంటే రెండో విడుత పంపిణీలో సబ్సిడీని ప్రభుత్వం పెంచడంతో గొర్రెల పెంపకందారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. మొదటి విడుత కింద ఒక్కో యూనిట్‌కు 20+1 గొర్రెలను పంపిణీ చేశారు. గతంలో యూ నిట్ విలువ రూ. 1.25లక్షలు ఉండగా, లబ్ధిదా రుడు తన వాటా కింద రూ.32,500 చెల్లించాల్సి ఉండేది. మిగతా మొత్తం ప్రభుత్వం భరించింది. ఈసారి ప్రభుత్వంయూనిట్ ధరను గణనీయంగా పెంచింది. రూ. 50వేలు పెంచి రూ. 1.75 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో గొర్రెల పెంపకందారులు రూ. 43,750 చెల్లించనుండగా.. మిగతా రూ. 1,31,250 వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు 5లోగా ఖాతాలు తెరిచి 10 నుంచి దశల వారీగా పంపిణీ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
విలువ పెంచడం ఆనందంగా ఉంది..
గొర్రెల పంపిణీ పథకానికి యూనిట్ విలువ పెం చడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మొదటి విడుత కింద యూనిట్ విలువ రూ. 1.25 లక్షలు ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం రూ. 50 వేలు పెంచి రూ. 1.75 లక్షలకు చేర్చింది. యూనిట్ విలువ పెంచడంతో మంచి గొర్రెలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా మాలాంటి ఎందరికో లబ్ధి చేకూరుతుంది.
-బోడ అశోక్, జాఫ్రాపూర్
మాట నిలబెట్టుకునే ప్రభుత్వం..
ముఖ్యమంత్రి ఏ మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టుకుంటారు. గొల్లకుర్మలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పథకాన్ని మొదటి విడుతగా అమలు చేసి ఎంతో మందికి చేయూతనందించిన్రు. రెండో విడుత కింద గొర్రెల పంపిణీ చేపడుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటికే మాకు అధికారులు సమాచారం అందించిన్రు. టీఆర్ఎస్ మాట నిలబెట్టుకునే ప్రభుత్వం.
-మహేశ్ యాదవ్, పాక్పట్ల