నార్నూర్, జూలై 27 : భారీ వర్షాలకు నార్నూర్, గాదిగూడ మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి పూర్తిసాయిలో నీరుచేరి అలుగు పారుతున్నాయి. ఇప్పటికే రెండు మండలాల్లో వంద శాతం మంది రైతులు వివిధ పంటల సాగు పనులు పూర్తి చేశారు. వరుసగా నాలుగేళ్లుగా వర్షాలు కురుస్తూ చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరి జళకళను సంతరించుకుంటున్నాయి. బీడు భూములు సస్యశ్యామలంగా మారుతున్నాయి. గతంలో వర్షాలు లేక, చుక్కనీరు రాక ఆయకట్టు కింద వందలాది ఎకరాలు భూములు బీళ్లుగా ఉండేవి. నాలుగేళ్లుగా ఈ పరిస్థితి కనిపించడం లేదని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. చెరువులు, కుంటల కింద పంటలు సాగవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
4వేల ఎకరాల్లో సాగుకు అవకాశం..
నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఆరు చెక్‌డ్యాంలు, 32 కుంటలు నీటితో జలకళను సంతరించుకున్నాయి. వీటి పరిధిలో 4వేల ఎకరాల వరకు ఆయకట్టు సాగులో ఉంది. ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటితో కళకళలాడుతున్నాయి. ఆయకట్టు రైతులు కొందరు ఇప్పటికే వివిధ రకాల పంటలు వేశారు. శైడ్వాయి కుంట కింద 90 ఎకరాలు, అర్జుని చెరువు కింద 100 ఎకరాలు, ఖండో చెరువు కింద 100 ఎకరాలు, గంగాపూర్ చెరువు కింద 100 ఎకరాలు, ముక్తాపూర్ చెరువు కింద 150 ఎకరాలు, దాబా(కే) చెరువు కింద 100 ఎకరాలు, గుండాల చెరువు కింద 100 ఎకరాలు,
కొలామా చెరువు కింద 215 ఎకరాలు, శివనారా చెరువు కింద 250 ఎకరాలు, ఝరి చెరువు కింద 150 ఎకరాలు, బలన్‌పూర్ చెరువు కింద 150 ఎకరాలు, భీంపూర్ కుంట కింద 30 ఎకరాలు, మహాగావ్కుంట కింద 35 ఎకరాలు, బేతల్గూడ చెరువు కింద 450 ఎకరాలు, నార్నూర్ కుంట కింద 30 ఎకరాలు, దుప్పాపూర్ చెరువు కింద 100 ఎకరాలు, లోకారి గొదురుగూడ చెరువు కింద 150 ఎకరాలు, నార్నూర్ కుంట కింద 60 ఎకరాలు,
రాజుల్‌గూడ కుంట కింద 60 ఎకరాలు, బలన్‌పూర్ చెరువు కింద 400 ఎకరాలు, కొత్తపల్లి(హెచ్) కుంట కింద 30 ఎకరాలు, సోనాపూర్ కుంట కింద తొమ్మిది ఎకరాలు, భీంపూర్ కుంట కింద 20 ఎకరాలు, షేకుగూడ కుంట కింద 30 ఎకరాలు, ఝరిలో 30 ఎకరాలు, తోయగూడలో 80 ఎకరాలు, అర్జుని గొండుగూడలో 30 ఎకరాలు, భీంపూర్‌లో 80 ఎకరాలు, గంగాపూర్ 150 ఎకరాలు, కొత్తపల్లి(జీ) 50 ఎకరాలు, పర్సువాడ(కే) 60 ఎకరాలు, పునాగూడ కుంట కింద 50 ఎకరాలు వీటితో పాటు ఆరు చెక్‌డ్యాంలలో 800ఎకరాలు వరకు ఆయకట్టు రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీయడంతో పాటు కట్టలు పటిష్ట పరచడం, అలుగు, తూములకు మరమ్మతులు, పంటకాలువల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. దీంతో చెరువుల్లో నీటి నిల్వ స్థాయి పెరిగింది. వీటితో పాటు భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ బావులు, చేతిపంపుల్లో నీరు పుష్కలంగా చేరింది. రెండు మండలాల్లో మొత్తంలో వానకాలం సాగు 50 వేల ఎకరాల వరకు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
జలకళతో పంటల సాగు..
చెరువుల్లోకి నీరు చేరడంతో పంటల సాగు చేసుకునే అవకాశం లభించింది. గతంలో నీళ్లు లేక భూములు బీళ్లుగా ఉండేవి. దీంతో కనీసం రూ.60 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టం వచ్చేది. రెండేళ్ల నుంచి వర్షాలకు చెరువులు నిండి మత్తడి దూకుతుండడంతో పంటలు సాగు చేసుకుంటున్నాం.
-మెస్రం జంగు, రైతు, శేకుగూడ
సంతోషంగా ఉంది
చెరువులు, కుంటల్లోకి నీరు రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలతో పాటు చిన్ననీటి వనరులు జలకళను సంతరించుకుంటున్నాయి. రైతులు అనుకున్నట్లు పంటలు పండించే అవకాశం లభించింది. వచ్చే యాసంగి పంటకు నీటికి డోకా ఉండదు.
-కొడప జాకు, రైతు, ఝరి
వానకాలం పంటకు అనుకూలం
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలకు మరమ్మతు చేయడంతో వర్షాలతో పూర్తిస్థాయిలో నీరుచేరడంతో వానకాలం పంటకు అనుకూలించే అంశం. వానకాలం సాగు సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టినైట్లె సాగుకు అనుకూలంగా ఉంటుంది. రైతులు అధికారుల సూచనలు తప్పక పాటించాలి.
– గిత్తే రమేశ్, వ్యవసాయ అధికారి, నార్నూర్