రామకృష్ణాపూర్, జూలై 24 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలో జాతీయ ప్రధాన రహదారిపై కొలువుదీరిన గాంధారి మైసమ్మ ఆషాఢ మాసం బోనాల జాతర ఆదివారం వైభవంగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాంధారిఖిల్లాలోని కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసమ్మ బోనాల జాతరకు చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బొక్కలగుట్ట పాలవాగు నుంచి డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ 108 బోనాలకు పూజలు నిర్వహించారు.
విప్ బాల్క సుమన్ బోనం ఎత్తారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, 9వ వార్డు కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి, కౌన్సిలర్లు అలుగుల శ్రీలత, పొలం సత్యం, ఆలయ కమిటీ సభ్యులు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో గాంధారి వనంలోని చిల్డ్రన్ పార్కు కిక్కిరిసిపోయింది. కరీంనగర్, వరంగల్, మంచిర్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చారు. మొక్కలు సమర్పించుకున్నారు. కుటుంబాలతో విడిది చేసి వంటావార్పు అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.
పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: విప్
గాంధారి ఖిల్లాను పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, పాలవాగుపై గతేడాది వంతెన నిర్మించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, సింగరేణి కార్మికులు, యువత, విద్యార్థులను మైసమ్మ తల్లి చల్లగా చూడాలని వేడుకున్నారు. జాతర సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ ఆధ్వర్యంలో ప్రమోద్‌రావు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 90 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల కనకయ్య, సభ్యులు బీమా సుధాకర్, కందునూరి రాజన్న, వేనెంక కుమార్, టీఎం సత్యనారాయణ, పెద్దమనిషి కనకయ్య, గుండా మల్లేశ్, మందమర్రి మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, జే.రవీందర్, ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.