ఆదిలాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న కేక్ కట్ చేశారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలోని తన పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్ద మాజీ ఎంపీ గొడం నగేశ్ మొక్కలు నాటారు. భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వంటి నాయకుడు దొరకడం తెలంగాణకు అదృష్టమని పేర్కొన్నారు. యువతకు ఆదర్శవంతమైన నాయకుడని, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దేశ, విదేశీ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంతో ఎంతో కృషి చేస్తున్నారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.