నార్నూర్,జూలై 23: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ పంచాయతీ సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని నాగల్కొండ, బలాన్పూర్తో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామాభివృద్ధి, రికార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంప్ యార్డుకు తరలించాలన్నారు. హరితహారంలో భాగంగా ఇంటింటా మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. తాగునీటి బావులు, ట్యాంకుల వద్ద క్లోరినేషన్, అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. ఇక్కడ మండల పంచాయతీ అధికారి స్వప్నశీల, సర్పంచ్ జాదవ్ సునీత, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ వైద్యుడు మనోజ్ పేర్కొన్నారు. శనివారం మాన్కాపూర్లో జ్వర సర్వే నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ.. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మురుగునీటి కాలువలు, పరిసరాలను పరిశీలించారు. ఇక్కడ ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, వైద్య సిబ్బంది ఈశ్వర్, జవహర్లాల్, గుంపాబాయి ఉన్నారు.
పారిశుధ్య చర్యలతో రోగాలు దూరం
పారిశుధ్య చర్యలు సక్రమంగా చేపడితే రోగాలు దరి చేరవని సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వీధుల్లో పర్యటించారు. తాగునీటి బావులు, ట్యాంకుల్లో క్లోరినేషన్, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇక్కడ వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఉట్నూర్ రూరల్, జూలై 23: ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్సీ వైద్యురాలు అనురాధ పేర్కొన్నారు. శనివారం లక్కారాం గ్రామంలోని వీధుల్లో వైద్య సిబ్బందితో కలిసి ఆమె పర్యటించారు. ఆయా ఇండ్లల్లో డ్రమ్ములు, పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి మలేరియా, డెంగీ తదితర జ్వరాలు ప్రబలుతాయన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది నూర్సింగ్, ప్రమోద్ తదితరులు ఉన్నారు.