ఎదులాపురం, జూలై 22 : ఆదిలాబాద్ పట్టణం సీసీ కెమెరాల నిఘాలో ఉందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కైలాస్నగర్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ప్రారంభం కానున్నందన్నారు. జిల్లాలో ప్రమాదాల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా కృషి చేస్తుందన్నా రు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కూడళ్లలో ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అతి త్వరలో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ద్వారా సీసీ కెమెరాల ఆధారంగా జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు, పిల్లలకు మోటర్ వెహికల్ యాక్ట్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ వెహికల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం , సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉమేందర్, సీఐలు పీ సురేందర్, కే మల్లేశ్, బీ రఘుపతి, గుణవంత్రావ్, ఎస్ఐ ఎంఏ హకీమ్ పాల్గొన్నారు.