ఉట్నూర్, జులై 22: ఏజెన్సీలో గంజాయిని నిర్మూలించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతికి గంజాయే కారణమని చెప్పారు. అధికారులు ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఏవో గణేశ్ రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాల అమలు తీరును వివరించారు.
మిషన్ భగీరథ నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన నాగాపూర్ సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ జైవంత్‌రావ్, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో పోల్చిచూసుకోవాలని హితవుపలికారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ చారులత, కోఆప్షన్ సభ్యుడు రషీద్, ఎంపీడీవో తిరుమల, ఆయాశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం..
ఉట్నూర్, జూలై 22 : గిరిజనులకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడీ ద్వారా నూతనంగా వచ్చిన పాల పౌడర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ చారులత, కోఆప్షన్ సభ్యుడు రషీద్, ఎంపీడీవో తిరుమల, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.