ఇచ్చోడ/బజార్హత్నూర్, జూలై 21 : పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధింపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై ఆందోళనలు చేశారు. సాలు మోదీ.. సంపకు మోదీ, జీఎస్టీని వెంటనే రద్దు చే యాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. తానూర్ మండలం కేం ద్రంలో నిరసన తెలిపి తహసీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం అందించారు. కుంటాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కలీంకు వినతిపత్రం అందించారు. మామడ మండల కేంద్రంలో నిరసన తెలిపి, తహసీల్దార్ కిరణ్మయికి వినతి పత్రం సమర్పించారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం పన్ను రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సోన్ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద భైఠాయించారు. లక్ష్మణచాంద మండలంలో నల్లజెండాలు పట్టుకొని నిరసన తెలిపారు. బాసర, సారంగాపూర్ మండలాల్లో కూడా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు.

ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్టారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించా రు. బజార్హత్నూర్ మండలంలోని ఇచ్చోడ-సోనాల అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిచ్చారు. ఈ సందర్భంగా సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల కడుపు కొడుతూ అదానీ, అంబానీ వంటి బడానాయకులకు దోచి పెడుతున్నాడని ధ్వజమెత్తారు. నిత్యావసర సరకులపై పెంచిన జీఎస్టీని రద్దు చేసే వరకూ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పోరు సాగిస్తుందన్నారు. మానవాళికి కూడు, గూడు, గుడ్డు, చెప్పులు, పప్పుల వంటి వాటిపై పన్ను విధించడం సమంజసం కాదన్నారు. సామాన్యులపై పెను భారం మోపుతుందన్నారు. మొన్నటి వరకు రైతులను ప్రత్యక్షంగా దెబ్బతీసేందుకు వరిధాన్యం కొనుగోలు చేయమని, అనవసర రైతు చట్టాలను రైతులపై రుద్దే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మోడీ హఠావో.. దేశ్‌కు బచావో అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.